Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: వస్తే లక్షల ఓట్లు.. పోతే వేల ఓట్లు.. డీఎస్సీ పై వైసీపీ ఆలోచన అదే!

YSRCP: వస్తే లక్షల ఓట్లు.. పోతే వేల ఓట్లు.. డీఎస్సీ పై వైసీపీ ఆలోచన అదే!

YSRCP: వస్తే కొండ.. పోతే ఈక.. అన్నట్టు ఆలోచనతో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మెగా డీఎస్సీ 2025 పై భారీగానే ప్లాన్ చేసింది ఆ పార్టీ. ఏడాది తరువాత అక్రమాలు జరిగాయి అంటూ ఆరోపణలు చేస్తోంది. కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతోంది. ఎక్కడ న్యాయపోరాటం చేయడం లేదు. దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కా స్కెచ్ అర్థం అవుతోంది. కేవలం రాష్ట్రంలో లక్షలాది ఓట్లను టార్గెట్ చేసుకునే ఈ కొత్త ప్రచారానికి తెర తీసింది. పోతే వేల ఓట్లు.. వస్తే లక్షల కోట్లు అన్నట్టు ఆలోచన చేసింది. గట్టిగానే ప్రణాళిక వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. సాక్షి మీడియాలో వ్యతిరేక కథనాలు వడ్డిస్తోంది.

* ఒక్క పోస్ట్ భర్తీ చేయలే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. కనీసం అటువంటి ఆలోచన చేయలేదు. అధికారంలోకి వస్తే ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తామని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారు జగన్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణ పొందిన లక్షలాదిమంది ఆశగా ఎదురు చూశారు. కానీ వారికి అవకాశం ఇవ్వలేదు జగన్. 2024 ఎన్నికలకు నెల రోజుల ముందు 6100 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డీఎస్సీ రద్దయింది. దీంతో లక్షలాదిమందికి ఎదురుచూపులు మిగిలిపోయాయి.

* మెగా డీఎస్సీ ప్రకటన..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు. నారా లోకేష్ నేతృత్వంలో డీఎస్సీ నియామక ప్రక్రియ గడువులోగా పూర్తి చేయగలిగారు. గత ఏడాది ఉపాధ్యాయులను నియమించారు. అయితే కూటమికి అదో ప్లస్ పాయింట్ గా మారింది. ఉపాధ్యాయ వర్గాల్లో కూడా సంతృప్తి కనిపిస్తోంది. అయితే ఇది అంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుచించలేదు. అందుకే కొత్త ప్రణాళిక వేసింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఏదైనా నియామక ప్రక్రియ పై ఆరోపణలు వస్తే వెంటనే కోర్టుకు వెళ్లాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అలా చేయలేదు. ఎందుకంటే డీఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగలేదు. ఆ విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేయడం కంటే దీనిని రాజకీయం చేయడానికి ఎక్కువగా వాడుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

* అభ్యర్థుల్లో గందరగోళం..
దాదాపు ఆరు లక్షల మంది డిఎస్సీ పరీక్ష రాశారు. అందులో 16 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ అభ్యర్థుల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. పోతే 16,000 ఓట్లు.. వస్తే లక్షల ఓట్లు అన్నది ఆ పార్టీ ఆలోచన. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికైనా రిజర్వేషన్లు అమలు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. కుల రిజర్వేషన్లతో పాటు దివ్యాంగులకు కొన్ని పోస్టులు కేటాయించాలి. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా అలానే చేసింది. నిన్ననే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సాక్షి మీడియాలో డీఎస్సీ అక్రమాలంటూ వచ్చిన కేస్ స్టడీ పై కూడా స్పష్టతనిచ్చారు. అయితే ఇదంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియనిది కాదు. డీఎస్సీ పై బురద జల్లి ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా చేయాలి. డీఎస్సీలో ఉద్యోగం రాని వారికి అనుమానం పెంచి వారిని తమ వైపునకు తిప్పుకోవాలి. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా ఇందులో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version