Siva Re Release : ఒక వేడుక లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి మాట్లాడుతూ ఆయన్ని మీరు ఎంతైనా ద్వేషించవచ్చు, కానీ ఆయన మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అని అంటాడు. నేడు జరిగిన ఒక సంఘటన చూస్తే అది నిజమే అని అనిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ గతం లో చిరంజీవి ని ఉద్దేశించి ఎంత నీచమైన కామెంట్స్ చేసేవాడో, ఎన్ని సెటైర్స్ వేసేవాడో మనమంతా చూసాము. పవన్ కళ్యాణ్ ని పైకి లేపడం కోసం చిరంజీవి ని కించపరుస్తూ ఎన్నో ట్వీట్స్ వేసాడు. దీనికి ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి సమాధానం చెప్తూ బాధ కూడా పడ్డాడు. అంతే కాదు, రామ్ గోపాల్ వర్మ తన సినిమాల్లో చిరంజీవి క్యారక్టర్ ని ప్యారడీ చేస్తూ చాలా ఎగతాళి కూడా చేసేవాడు. అలాంటి రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) ని చిరంజీవి రీసెంట్ గా పొగడ్తలతో ముంచి ఎత్తాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నెల 14న అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన శివ(Siva Re Release) చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుంది. ఆరోజుల్లో శివ సృష్టించిన ప్రభంజనం గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. అలాంటి సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘శివ చూసిన తర్వాత అప్పట్లో నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. శివ ఒక సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్, ఒక కొత్త ఒరవడికి నాంది పలికిన చిత్రం శివ. ఇప్పటికీ ఆ సైకిల్ చైన్ సన్నివేశాన్ని ఆడియన్స్ మర్చిపోలేరు. కల్ట్ షాట్ అని చెప్పొచ్చు. నాగార్జున తన నటనలో ఆ తీవ్రత, తన చూపుల్లోని తీక్షణత, ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న శక్తి ఈ చిత్రం లో అద్భుతంగా ఉంటుంది. అమల గారి నటన, రఘువరన్ క్యారక్టర్, ఇలా ఈ సినిమాలో ప్రతీ నటుడు ప్రతీ ఫ్రేమ్ కి జీవం పోశారు. అలాంటి సినిమా ఈ డిజిటల్ యుగం లో విడుదల కాబోతోంది అన్ని చెప్పడం నాకు ఎంతో సంతోషింది’.
‘నేటి తరం జెన్ జీ యువతకు ఇలాంటి సినిమాలు చూపించాలి. అప్పట్లోనే ఇలాంటి సినిమాని ఎలా తీశారు అని తెలుసుకోవడం అత్యవసరం. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన విజన్, ఆ కెమెరా యాంగిల్స్, లైట్ & సౌండ్ ప్రొజెక్షన్, ప్రెజెంటేషన్ అప్పట్లో కొత్తగా అనిపించింది. ఆరోజే నేను అనుకున్నాను, ఈ యువ దర్శకుడు మన ఇండియన్ సినిమాకు భవిష్యత్తు అవుతాడని అనుకున్నాను. అలానే అయ్యాడు. ఈ సందర్భంగా మూవీ టీం మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఈ వీడియో ని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ చిరంజీవి కి కృతఙ్ఞతలు తెలిపాడు. గతంలో నేను మిమ్మల్ని చాలా మాటలు అన్నాను, అవన్నీ ఉద్దేశపూర్వకంగా కాదు, కానీ అవేమి మీరు మనసులో పెట్టుకోకుండా నా గురించి ఇంత గొప్పగా మాట్లాడారు అంటూ రామ్ గోపాల్ వర్మ కాస్త ఎమోషనల్ అయ్యాడు.
Thank you @KChiruTweets gaaru, Also on this occasion I want to sincerely apologise to you if I ever unintentionally offended you ..Thank you once again for your large heartedness pic.twitter.com/08EaUPVCQT
— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2025