Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. ఇన్ని రోజులపాటు నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. చివరి రోజు కూడా నేతలు ఎవరూ తగ్గలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట్ దీ ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. భారత రాష్ట్రపతి అధినేత కేసిఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. కేటీఆర్ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఇక బిజెపి నేతలు అటు గులాబీ పార్టీని.. ఇటు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఈ పరిణామాలు జరుగుతుండగానే గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాగంటి గోపీనాథ్ తల్లి, మొదటి భార్య కుమారుడు తెరపైకి వచ్చారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. “నాడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నన్ను బెదిరించారు.. హాస్పిటల్ రావద్దని అన్నారు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పారు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేదు. నన్ను మాత్రమే కాదు, మా పెదనాన్న కూడా రావద్దని చెప్పారు. నాకు మా గంటి సునీత నుంచి ఫోన్ కూడా వచ్చింది. ఆ ఫోన్ నెంబర్, అఫిడవిట్ లో ఆమె ప్రస్తావించిన ఫోన్ నెంబర్ ఒకటే. కావాలంటే మీరు చూసుకోండి. హాస్పిటల్ రావద్దని ఒక నోట్ కూడా పంపారు. ఆ నోట్ లో మా కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించారు. ఇలా మమ్మల్ని అనుక్షణం ఇబ్బంది పెట్టారు. కనీసం మా నాన్న చివరి చూపు కూడా మమ్మల్ని చూసుకోకుండా చేశారని” మాగంటి గోపీనాథ్ కుమారుడు, మాగంటి గోపీనాథ్ తల్లి ఆరోపించారు.
మాగంటి గోపీనాథ్ మరణానికి సంబంధించి తనకు అనుమానాలు ఉన్నాయని మొదటి నుంచి కూడా ఆయన మాతృమూర్తి ఆరోపిస్తూ వస్తున్నారు. ఇటీవల గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఉద్దేశించి ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు తెరపైకి మాగంటి గోపీనాథ్ కుమారుడు వచ్చారు. కీలకమైన ఆధారాలను బయటపెట్టారు. తమ తండ్రి మరణం తర్వాత ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో ఆయన వివరించారు. పోలింగ్ కు ఒకరోజు ముందుగానే వారు ఈ విషయాలు వెల్లడించడంతో.. గులాబీ పార్టీకి షాక్ తగిలే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాగంటి గోపీనాథ్ విషయంలో మొదటినుంచి కేటీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. అది ఇప్పుడు నిరూపితమైందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మాగంటి గోపీనాథ్ మాతృమూర్తి.. ఆయన మొదటి భార్య కుమారుడు కీలకమైన విమర్శలు చేసిన నేపథ్యంలో గులాబీ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? మాగంటి సునీత ఎలా రెస్పాండ్ అవుతారు? అనే విషయాలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.