Dil Raju : సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి తెలంగాణా అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పై ఫైర్ అవుతూ ఇక మీదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఏ సినిమాకి కూడా టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ కి అనుమతిని ఇవ్వబోను అంటూ చాలా కఠినంగా చెప్పిన సంగతి తెలిసిందే. సీఎం మాట్లాడిన ఆ మాటలకు టాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా దిల్ రాజు సినిమా ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి,సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి కి భేటీ ని ఏర్పాటు చేసాడు. ఈ భేటీ లో సినీ పరిశ్రమ ఎదుగుదల గురించి మాత్రమే చర్చల్లోకి వచ్చిందని, టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అయితే మరో నాలుగు రోజుల్లో ఆయన ఆయన నిర్మించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా నేడు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన దిల్ రాజు, టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ గురించి మాట్లాడుతూ ‘సీఎం గారిని అప్పోయింట్మెంట్ అడిగాను. త్వరలోనే ఆయనతో దీని గురించి చర్చిస్తాను. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ముందుకు పోతాం’ అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. అప్పుడు ఒక మీడియా రిపోర్టర్ దిల్ రాజు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ ఇవ్వనని అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా మీరు టికెట్ రేట్స్ ఆశిస్తున్నారా ?’ అని అడగగా, దానికి దిల్ రాజు సమాధానం చెప్తూ ‘మీరు కావాలంటే సీఎం గారి స్పీచ్ చూడండి. ఆయన సినీ పరిశ్రమ పైకి ఎదిగేందుకు ఎలాంటి సహాయ కావాలన్నా చేస్తామని చెప్పారు. ఒకటికి పది సార్లు నేను ఆ స్పీచ్ ని చూసాను , ఆ ఆశతోనే నేను ఆయన దగ్గరకు వెళ్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.
‘మొన్న జరిగిన మీటింగ్ లో కూడా సినీ పరిశ్రమ ఎదగడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది, కాకపోతే సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేయండి అని చెప్పారు’ అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అంటే తెలంగాణ లో కూడా టికెట్ హైక్స్ ఉండబోతున్నాయి అన్నమాట. తెలంగాణ విషయం తేలే వరకు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించొద్దు అంటూ దిల్ రాజు బయ్యర్స్ కి ఆదేశాలు జారీ చేసాడట. రేపు లేదా ఎల్లుండి లోపు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే బెంగళూరు లోని కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా 15 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు అక్కడి ట్రేడ్ పండితులు.