Rao Ramesh: బహుశా కోట్లు సంపాదించే స్టార్ హీరోలు కూడా ఇంత మొత్తంలో దానం చేయరేమో. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ తన వద్ద పని చేసిన ఎంప్లాయ్ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేశాడు. ఈ వెండితెర విలన్ మంచి మనసు చూసి జనాలు భేష్ అంటున్నారు. రావు రమేష్ వద్ద కొన్నాళ్లుగా బాబు అనే మేకప్ ఆర్టిస్ట్ పని చేస్తున్నారు. బాబు ఇటీవల ప్రమాదవశాత్తు అకాల మరణం పొందాడు. ఆ కుటుంబానికి అతడే ఆధారం. బాబు మరణంతో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పేద కుటుంబానికి రావు రమేష్ అండగా నిలిచాడు.

బాబు మరణవార్త తెలుసుకున్న రావు రమేష్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం బాబు ఇంటికి వెళ్లి భార్య, కూతురుని కలిశాడు. వేదనలో ఉన్న వారికి ధైర్యం చెప్పాడు. రూ. 10 లక్షల రూపాయల చెక్ అందజేశాడు. అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. బాబు కూతురు చదువు బాధ్యతలు కూడా తీసుకున్నారట. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సంప్రదించమని చెప్పారట. కరుడు గట్టిన విలన్ గా ప్రేక్షకుల్లో ఆవేశం రగిలించే రావు రమేష్ నిజ జీవితంలో ఎంతటి మనసున్న మారాజో నిరూపించుకున్నాడు.
రావు రమేష్ ఔదార్యానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. తన పర్సనల్ మేకప్ మాన్ కుటుంబాన్ని రావు రమేష్ ఆర్థికంగా ఆదుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ ఆయన్ని పొగడలతో ముంచెత్తారు. రావు రమేష్ లాంటి నటులు ఎందరికో ఆదర్శమని కొనియాడుతున్నారు. ఇక లెజెండరీ విలన్ రావు గోపాలరావు కొడుకైన రావు రమేష్ పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ పాత్రల్లో రాణిస్తూ విలక్షణ నటుడయ్యాడు. ఈ తరం టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో రావు రమేష్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆయన విరివిగా చిత్రాలు చేస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కొట్టిన కెజిఎఫ్ 2 మూవీలో రావు రమేష్ కీలక రోల్ చేసిన విషయం తెలిసిందే. పాత్ర ఏదైనా సహజంగా రక్తి కట్టించడం రావు రమేష్ గొప్పతనం. రావు గోపాలరావు చాలా కాలం క్రితమే మరణించగా రావు రమేష్ స్వశక్తితో ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.