Controversial Cattle Bill: ప్రజా పోరాటాలకు ఎవరైనా తలొగ్గి రావాల్సిందే. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. అధికారం ఉందన్న అహంకారంతో ఏ చట్టం పడితే ఆ చట్టం చేసి బలవంతంగా రుద్దితే ఎవరూ ఊరుకోరు. ఆ చట్టాన్ని తెచ్చిన పాలకులను నేలకు దించేదాకా పట్టు విడవరు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అధికార బిజెపి వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చి.. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కాగానే నేలకు దిగి వచ్చింది కాబట్టి.

దెబ్బకు ఠారెత్తి పోయింది
గత నాలుగు పర్యాయాలుగా గుజరాత్ రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంది. మోది తర్వాత ఆ స్థాయిలో మార్క్ చూపించే నాయకుడు లేకపోయినప్పటికీ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షణ వల్ల ఆ లోటు కనిపించడం లేదు. కానీ కొన్నిసార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాగ్రహానికి కారణమైంది. ఫలితంగా ప్రభుత్వం కిందికి దిగి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జంతు నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 60 లక్షల మాల్దారీలు గుజరాత్ ను స్తంభింపజేశారు. దీంతో బెంబేలెత్తిపోయిన సర్కారు అత్యవసరంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చ లేకుండానే బిల్లును వెనక్కి తీసుకుంది.
ఇంతకీ ఏమిటి ఆ చట్టం
మాల్దారి అనేది గుజరాతి పదం. మాల్ అంటే పశువులు. దారీ అంటే కలిగి ఉండటం.. పశువులు పెంచుకునే వాళ్లని మాల్దారీలు అంటారు. చాలా కాలం క్రితం వీరు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చి గిర్ అభయారణ్యం అంచుల వెంట స్థిరపడ్డారు. పశువులు, మేకలు, గొర్రెల పెంపకం.. పాలవిక్రయం వీళ్ళ ప్రధాన వృత్తి.. అయితే గుజరాత్ లోని పట్టణాలు, నగరాల్లోకి పశువులు, మేకలు, గొర్రెలు, గాడిదల వంటి జంతువులు ప్రవేశించడాన్ని నిషేధించేందుకు బిజెపి ప్రభుత్వం గత మార్చిలో గుజరాత్ క్యాటిల్ కంట్రోల్ కీపింగ్ అండ్ మూవీ ఇన్ అర్బన్ ఏరియాస్ బిల్_2022ను రూపొందించింది. దీనిని అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ బిల్లు చట్టంగా మారితే రాష్ట్రంలోని ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు, 162 మున్సిపాలిటీల్లోకి పశువుల ప్రవేశం కష్టతరం అవుతుంది. పట్టణాల్లోకి పశువులను తరలించాలన్నా, పెంచుకోవాలన్నా లైసెన్సు తీసుకోవడం తప్పనిసరి. లైసెన్స్ తీసుకున్న 15 రోజుల్లోగా పశువుల యజమానులు పశువులన్నింటికీ ట్యాగులు వేయాలి. పశువులు కట్లు తెంపుకొని రోడ్డుపైకి వస్తే దాని యజమాని పై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు. ఆ నేరానికి ఐదేళ్ల కఠిన జైలు శిక్షతోపాటు 5 లక్షల వరకు జరిమానా విధించేలా రూపొందించింది.

దెబ్బకు నేలకు దిగి వచ్చింది
ఈ వివాదాస్పద బిల్లును వెనక్కి తీసుకోవాలని మాల్దారీలు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభువా పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. గుజరాత్ కు ఆయువు పట్టు లాంటి అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్ వంటి నగరాల్లో రోడ్లను మాల్దారీలు దిగ్బంధించారు. గుజరాత్ రాష్ట్రానికి అవసరమైన పాలసరఫరాను నిలిపివేశారు. అమూల్ సహకార సంస్థ కు కూడా పాలు పోయకుండా నిరసన వ్యక్తం చేశారు. దీంతో గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా పాల కొరత ఏర్పడింది. పాలు లభించక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దెబ్బకు బిజెపి ప్రభుత్వం వణికిపోయింది. మరో ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో గత్యంతరం లేక రాష్ట్ర గవర్నర్ ను సంప్రదించింది . వెంటనే బిల్లును వెనక్కి తీసుకుంది. ఈ ఆందోళనల వెనుక అప్ హస్తం ఉందని బిజెపి ఆరోపిస్తుండగా.. ప్రజాగ్రహం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని ఆప్ నేతలు అంటున్నారు. మరో రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇదే గతి పడుతుందని జోస్యం చెబుతున్నారు.
Also Read: Life Prisoners- AP Govt: జీవిత ఖైదీలకు క్షమాభిక్ష.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉందా?