Ram Pothineni : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే రికార్డ్స్ ని బద్దలు కొట్టి, యూత్ ఆడియన్స్ లో స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో రామ్ పోతినేని(Ram Pothineni). అప్పట్లో ఈయన ఎనర్జీ, ఈయన తీస్తున్న సూపర్ హిట్ సినిమాలను చూసి, టాలీవుడ్ కి మరో స్టార్ దొరికేశాడని అంతా అనుకున్నారు. కానీ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ రావడం, మళ్లీ పైకి లేవడం, మళ్లీ ఫ్లాప్స్ రావడంతో రామ్ ఆ స్థానానికి చేరుకోలేకపోయాడు. కానీ యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో ఆయనకు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. అయితే రామ్ రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోకి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో రామ్ పోతినేని తన జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ ‘నా వ్యక్తిగత విషయాలను నేనెప్పుడూ ఏ వేదిక మీద కూడా చెప్పుకోలేదు. కానీ ఈరోజు మీ ముందు పంచుకుంటాను. మా అమ్మ వాళ్ళది హైదరాబాద్ కావడంతో నేను అక్కడే పుట్టాను. ఆ తర్వాత విజయవాడకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. 1988 వ సంవత్సరం లో విజయవాడ లో పెద్ద ఎత్తున కుల ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో మా కుటుంబం అప్పటి వరకు సంపాదించి సంపాదన మొత్తం కోల్పోయి, రాత్రికి రాత్రి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో మా నాన్న విజయవాడ లో ఉండడం కరెక్ట్ కాదని చెన్నై కి వెళ్ళిపోయాము. నాన్న మళ్లీ తన కెరీర్ ని జీరో నుండి మొదలు పెట్టాల్సి వచ్చింది. క్రింద నుండి పైకి రావడం వేరు, కానీ సంపాదించింది అంతా కోల్పోయిన తర్వాత మళ్లీ తిరిగి పైకి రావడం వేరు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన కొనసాగిస్తూ ‘మేము ఏ స్థాయిలో ఆస్తులను కోల్పోయామో మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. విజయవాడ లో ఉన్నప్పుడు మా ఇంట్లో నాకోసం మా నాన్న కొన్న బొమ్మలు ఒక పెద్ద గదికి పట్టేంత ఉండేవి. తర్వాత మేము చెన్నైకి వెళ్ళినప్పుడు, పాత ఇంట్లో నా బొమ్మలు దాచుకోవడానికి ఉపయోగించిన గది అంత కూడా మా ఇల్లు మొత్తం ఉండేది కాదు. అంత చిన్న ఇంటికి షిఫ్ట్ అయ్యాము. జీవితం మొత్తం మా నాన్న ఇలా ఎన్నో ఒడిదుడుగులను ఎదురుకొని, మాకు ఎలాంటి కష్టం తెలియకుండా పెంచాడు. అందుకే ఆయనంటే నాకు అంత గౌరవం’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్. ఇలా ఆయన జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ ఎపిసోడ్ ని మీరు జీ5 లో చూడొచ్చు