Allu Arjun Pushpa 2- Ram Charan: పుష్ప సినిమాతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు మన అల్లు అర్జున్. సుకుమార్ తీసిన ఈ అద్భుత కథా చిత్రం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. దేశమంతా ఆదరణ చూరగొంది. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అన్న డైలాగ్ ఊపు ఊపేసింది. ‘శ్రీవల్లి’ పాటను టీమిండియా క్రికెటర్ల నుంచి సామాన్యుల వరకూ స్ఫూఫ్స్ చేసి అలరించారు. అంతలా జనంలోకి చొచ్చుకెళ్లిన ‘పుష్ప’ మూవీకి కొనసాగింపుగా ‘పుష్ప2’ రాబోతోంది.

ఈ మూవీ కోసం సుకుమార్ పూర్తిగా కథను మార్చేశారు. బాగా కసరత్తు చేసి మరీ పుష్ప2కు మరిన్ని హంగులు అద్దారు. కథను పకడ్బందీగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ‘పుష్ప2’ నుంచి ఒక మాస్ డైలాగ్ లీక్ అయ్యి వైరల్ అయ్యింది. తాజాగా మరో ఆసక్తికర వార్త సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
‘పుష్ప2’లో రాంచరణ్ అతిథి పాత్రలో నటించనున్నారని సమాచారం. సుకుమార్ ఈ మేరకు పాత్రను డిజైన్ చేసినట్టు తెలిసింది. కథను మలుపు తిప్పే పాత్రలో రాంచరణ్ తో చేయిస్తున్నట్టు తెలిసింది.ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’తో రాంచరణ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల పలు అవార్డులు కూడా రాంచరణ్ సొంతమయ్యాయి.
పుష్ప2లో రాంచరణ్ అతిథి పాత్ర అయిన కలెక్టర్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఎస్పీ షెకావత్ తో పుష్పకు ఏర్పడిన భీకర యుద్ధాన్ని మలుపు తిప్పి పుష్పను సేవ్ చేసే కీలక పాత్రలో రాంచరణ్ ను తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం శంకర్ మూవీలో బిజీగా ఉన్నప్పటికీ బన్నీ కోసం రాంచరణ్ ఈ కీలక పాత్రను పోషించడానికి అంగీకరించినట్టు తెలిసింది. ఈ ఇద్దరు స్టార్స్ కలిస్తే పుష్ప2 బాక్సాఫీస్ బద్దలు చేయడం గ్యారెంటీ అని మెగా అభిమానులు సంతోషపడుతున్నారు.

గతంలోనూ రాంచరణ్, అల్లు అర్జున్ కలిసి ‘ఎవడు’ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ పుష్ప2లో కూడా కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలు తప్పవు.
ప్రస్తుతం పుష్ప2 మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 2024లో విడుదల చేయాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.