Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: ఏపీలో అధికారం కోసం.. తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబు

Chandrababu: ఏపీలో అధికారం కోసం.. తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబు

Chandrababu: సంక్షోభాలను, సవాళ్లను విజయంగా మలుచుకున్న నేత చంద్రబాబు. ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రావడం ఆయన ముందున్న కర్తవ్యం. అందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఏడు పదుల వయసులో కూడా శక్తికి మించి కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడానికి ఇష్టపడడం లేదు. ఏపీలో అధికారంలోకి రావడానికి ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో టీడీపీని రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభావముండే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ లో టీడీపీని బలోపేతం చేసే పనిలో పడ్డారన్న టాక్ నడుస్తోంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభతో తెలంగాణలో టీడీపీ పునరాగమనానికి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రిని టీడీపీలోకి రప్పించడం ద్వారా పాతకాపులను దగ్గరకు చేర్చుకునేందుకు భారీ స్కెచ్ వేశారు.

Chandrababu
Chandrababu

ఏపీలో వచ్చే ఎన్నికలు చంద్రబాబుతో పాటు టీడీపీకి జీవన్మరణ సమస్య. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి తేకుంటే జరిగే మూల్యం చంద్రబాబుకు తెలుసు. అందుకే బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు ఆయన పొత్తులకు ముందే తలుపులు తెరిచారు. జనసేనతో పాటు బీజేపీని కలుపుకొని పోవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ అంతరంగం ఆయనకు అంతుపట్టడం లేదు. చిక్కినట్టే చిక్కి బీజేపీ తప్పించుకుంటోంది. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో కలిసేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం అంతగా ఆసక్తి చూపడం లేదన్న వార్తలు వస్తున్నాయి. అందుకే బీజేపీ తన స్నేహాన్ని అందిపుచ్చుకునేందుకు ఏ అవకాశాన్ని చంద్రబాబు జారవిడుచుకోకూడదని భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో రీ ఎంట్రీ ఇచ్చి బీజేపీకి దగ్గరవ్వాలని భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎన్ని చేయాలో అన్నీ చేస్తోంది. కొంతవరకూ వర్కవుట్ అయినా.. తెలంగాణలో కొంత పార్టులోనే తన ప్రభావం చూపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఈ బలం సరిపోదు. మరోవైపు టీఆర్ఎస్ భారతీయ రాష్ట్రసమితిగా మారి జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. తద్వారా ఇంతకాలం ప్రాంతీయ వాదంతో నడిచిన రాజకీయం ఇక చెల్లని పరిస్థితి. అందుకే అదునుచూసి చంద్రబాబు తెలంగాణలో రీఎంట్రీ ఇస్తున్నారు. గ్రౌండ్ లెవల్ లో ఉన్న జవసత్వాలకు నీరుపోయాలని భావిస్తున్నారు. సెలెక్టివ్ జిల్లాలను ఎంపిక చేసుకొని రాజకీయం మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మాజీ మంత్రి, పూర్వాశ్రమం టీడీపీలో యాక్టివ్ గా పనిచేసిన నేతను తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రాంతీయ వాదంతో టీడీపీని తెలంగాణలో నిర్వీర్యం చేసిన నేపథ్యంలో చాలామంది నేతలు తెలుగుదేశం కు దూరమయ్యారు. ఇతర పార్టీల్లో ఉన్నారు. వారందర్నీ తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు.

Chandrababu
Chandrababu

2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన క్రమంలో టీడీపీకి తెలంగాణలో 15 సీట్లు వచ్చాయి. అటు తరువాత 2019లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టగా కేవలం రెండుచోట్ల మాత్రమే పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ తో కలిసినా వర్కవుట్ కాలేదు. తెలంగాణలో ఎన్నికలకు మరో 10 మాసాలే ఉన్న నేపథ్యంలో టీడీపీని యాక్టివ్ చేస్తే బీజేపీని దగ్గర చేర్చుకోవచ్చని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయాలను కాస్తా పక్కన పెట్టి తెలంగాణపై ఫోకస్ పెంచారు. ఖమ్మం బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి తెలంగాణలో టీడీపీ ఇంకా బతికే ఉందని.. బరిలో ఉందని సంకేతాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల నాటికి టీడీపీని బలోపేతం చేసి కనీసం 30 సీట్లలో ప్రబలమైన శక్తిగా మార్చితే బీజేపీ తన దరికి వస్తుందని భావిస్తున్నారు. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి తప్పనిసరిగా టీడీపీని తన కూటమిలో కలుపుకుంటుంది. ఆ కూటమి కానీ తెలంగాణలో వర్కవుట్అయితే ఏపీలో కూడా బీజేపీ తన వెంట రాక తప్పని అనివార్య పరిస్థితులు కల్పించాలన్నది చంద్రబాబు వ్యూహం. అటు గతంలో మాదిరిగా ఆంధ్రా నాయకుల పెత్తనం అన్న మాట భారతీయ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్ నుంచి వినిపించడానికి వీలులేదు. దీంతో కరెక్ట్ టైమ్ చూసి చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు మొదలు పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular