Ram Charan : నిజానికి మన దేశంలో ఓటీటీల ప్రాధాన్యం పెరగడానికి ఇంకా చాలా సమయే పట్టేది. కానీ.. కరోనా వచ్చి ఆ కాలాన్ని తగ్గించేసింది. థియేటర్లు మూతపడడంతో అనివార్యంగా ప్రేక్షకులు ఓటీటీలను ఆశ్రయించాల్సి వచ్చింది. జనాల ఆదరణ పెరగడం గమనించిన సంస్థలు.. ఓటీటీ వ్యవస్థకు భవిష్యత్ ఉందని భావిస్తూ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన సంస్థలు.. ఇండియాలో భాషల వారీగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా..తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది డిస్నీ హాట్ స్టార్.
అయితే.. ఏ సంస్థ అయినా, కార్యక్రమమైనా ప్రజల్లోకి వెళ్లాలంటే ప్రచారం అత్యంత కీలకం. అందుకే.. యాడ్స్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటాయి సంస్థలు. ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్ కూడా తన ప్రమోషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్ ను నియమించుకుంది. అది కూడా ఎవరినో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను సెలక్ట్ చేసుకుంది.
భారత్ లో కంటెంట్ ను కొత్త పుంతలు తొక్కించేందుకు మేం ఎల్లప్పుడూ ముందు వరసలో ఉంటాం. ఇప్పుడు తెలుగు వినోద ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందని హాట్ స్టార్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాణ్యమైన కంటెంట్ ఇస్తున్న ఓటీటీల్లో హాట్ స్టార్ కూడా ఉంది. ఐపీఎల్-21 (IPL 2021) ను హాట్ స్టార్ (Hot Star OTT) ప్రసారం చేస్తోంది. ఐసీసీ వరల్డ్ కప్ (T20 World Cup) ను కూడా ప్రనసారం చేయబోతోంది. బిగ్ బాస్ రియాలిటీ షో కూడా హాట్ స్టార్ లోనే ఉంది. దీంతోపాటు మరిన్ని తెలుగు సినిమాలను కూడా స్ట్రీమ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నితిన్ హీరోగా వచ్చిన మాస్ట్రో ఇందులోనే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మరిన్ని చిత్రాలను అందించేందుకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే తమ సంస్థకు ప్రచారకర్తగా రామ్ చరణ్ ను నియమించుకుంది. ఇందుకోసం ఏకంగా 6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట రామ్ చరణ్. తెలుగులో చెర్రీకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా పారితోషికం ఎంతైనా చెల్లించేందుకు సంస్థ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా చెర్రీ మాట్లాతూ.. తెలుగు వినోద రంగంలోకి హాట్ స్టార్ రావడం వల్ల మేకర్స్ కు, నటీనటులకు అవకాశాలు వస్తాయని అన్నారు. డిస్నీ హాట్ స్టార్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు చెర్రీ.