Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోన్న 50వ మూవీ కావడం ఒకటైతే… చరణ్ కు ఇది 15 వ చిత్రం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాగా ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల పుణేలో పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్- కియారా అద్వాని మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారట. ఇందుకోసం ఒక భారీ సెట్ వేయిస్తున్నారట. ఈ సెట్ కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్‌కు దాదాపు 40 కోట్లను కేటాయించినట్టుగా చెప్పుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాలోని ‘వాజీ వాజీ’ అనే పాట తరహాలో ఈ పాటను డిజైన్ చేశారట. ఈ పాట కోసమే అత్యంత భారీ ఖర్చుతో సెట్ వేయిస్తున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. కేవలం పాట కోసం కాకుండా మరి కొన్ని సీన్స్‌ను కూడా ఇక్కడ ప్లాన్ చేసే అవకాశం ఉందట. ఈ సినిమాలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలానే ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ఈ సినిమాతో పాటు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్ఆర్, కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలు పూర్తి చేశాడు.