
సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు డిమాండ్ వస్తుందో, ఉన్న డిమాండ్ ఎప్పుడు పడిపోతుందో అంచనా వేయడం అసాధ్యం. హిట్ ఒక్కటే డిమాండ్ ను క్రియేట్ చేస్తోంది అంటారు గానీ, అది కూడా అబద్ధమే. హిట్ వచ్చి కూడా, ఛాన్స్ లు రాక ఇబ్బందులు పడుతోన్న వాళ్ళు ఇండస్ట్రీలో చాలమంది ఉన్నారు. అంటే హిట్ రావడం వేరు, హిట్ మన వల్ల రావడం వేరు.
రెండో పాయింట్ లోనే ఛాన్స్ లు ఆధారపడి ఉంటాయి. ఏది ఏమైనా సినిమా రంగంలో ఓడలు బండ్లు అవ్వడానికి, బండ్లు ఓడలుగా మారడానికి సరైన కారణాలు అక్కర్లేదు. అందుకే సినీ సెలబ్రిటీలు అంతా తమ సినీ జీవితం ఎంతసేపు వెలుగుతుందో, ఎప్పుడు ఆరిపోతుందో అని ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. ఒక్క సినిమా చాలు జీవితాలను తలకిందులు చేయడానికి.
ముఖ్యంగా హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో ఒక్క సినిమా అవుట్ ఫుట్ చాలు. వాళ్ళకు ఊహించని షాక్ ఇవ్వడానికి. ఇప్పుడు ప్రస్తుతం అందాల తార రకుల్‌ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగినా.. ఎప్పుడో ఆరిపోయిన దీపం లాగే రకుల్ ను ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. దర్శకుడు క్రిష్ వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ నటిస్తోంది. అయితే కరోనా సృష్టిస్తున్న విలయతాండవంలో ఈ సినిమా కూడా బలి అయింది. షూటింగ్ దాదాపు పూర్తి అయినా మళ్ళీ బ్యాలెన్స్ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. మరోపక్క ఈ సినిమాకి రకుల్ కి ఇచ్చే రెమ్యునరేషనే చాల తక్కువ. సహజంగా ఆమె తీసుకునే దానిలో సగమే ఇస్తున్నారు.
అలాంటాది ఆ ఇచ్చే సగంలో కూడా ఇంకా తగ్గించుకోవాలని రకుల్ ను కోరుతున్నారట నిర్మాతలు. నిర్మాత పై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందరం రెమ్యునరేషన్ తగ్గించుకుందామని దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చాడట. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ రకుల్ తప్పక తన రెమ్యునరేషన్ ను దాదాపు మళ్ళీ సగం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది, పాపం రకుల్.