‘హీరో ధనుష్’ తానూ ఒక హీరోగా కంటే కూడా ‘సూపర్ స్టార్ రజినీకాంత్’ అల్లుడిగానే ఎక్కువ సంతోషపడతాను అని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఒక నటుడిగా చూసుకుంటే.. ధనుష్ సూపర్ ఆర్టిస్ట్, వైవిధ్యమైన హీరో, విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ముఖ్యంగా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోవడం ధనుష్ కి మేకప్ తో పెట్టిన విద్య.
అందుకే హాలీవుడ్ సైతం ధనుష్ నటనను గుర్తించింది. ఆఫర్ కూడా అందించింది. దాంతో ఏకంగా ధనుష్ హాలీవుడ్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించిన ధనుష్, ఇప్పుడు హాలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి. అయితే ధనుష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఎప్పుడూ సూపర్ స్టార్ రజినీకాంత్ ని తానూ అనుకరించలేదని, అభిమానులు ఎంత ఒత్తిడి చేసినా రజిని స్టైల్ ను తానూ ఫాలో అవ్వలేదని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ధనుష్ మాటల్లోనే ‘రజిని సర్ కోట్లాది అభిమానులలో నేను ఒక అభిమానిని. అయితే, సూపర్ స్టార్ అల్లుడిని కాబట్టి, రజిని సర్ ఇమేజ్ ని నేను వాడుకుంటున్నానని నన్ను చులకన చేస్తారేమో అని, ఇన్నాళ్లు నేను ఆయనను అనుకరించలేదు.
కానీ, నేను, సూపర్ స్టార్ రజినీకాంత్ మేనరిజమ్ ను మొదటి సారి ఫాలో అయ్యాను. నా ‘జగమే తందిరం’ సినిమాలో ఈ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాలో ఎలాగైనా రజినీకాంత్ మేనరిజమ్ ను వాడుదామని బలవంతం పెట్టాడు. అందుకే నేను కూడా ఒప్పుకున్నాను’ అంటూ ధనుష్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ “జగమే తందిరం” తమిళ చిత్రం ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.