Rajinikanth: గత ఐదేళ్లుగా రజినీకాంత్ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య రజినీకాంత్ సుదీర్ఘ కాలం అమెరికాలో చికిత్స తీసుకున్నారు. రజినీకాంత్ రాజకీయాలకు దూరం కావడానికి కూడా ఇదే ప్రధాన కారణం. ఆయన వయసు, ఆరోగ్యం రీత్యా సభలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది కాదని వైద్యులు సూచించారనే వాదన ఉంది. అభిమానులు ఎంతగా డిమాండ్ చేసినా… రజినీకాంత్, ఇది ఆ దేవుడి నిర్ణయం. పాలిటిక్స్ కి రాను అని గట్టిగా చెప్పారు.
ఈ ప్రకటన తర్వాత రజినీకాంత్ నటుడిగా బిజీ అయ్యారు. ఆయన వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. కాగా రజినీకాంత్ సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. రజినీకాంత్ కి గుండెకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నట్లు సమాచారం.
ముందస్తు చర్యలో భాగంగా ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఎలక్టివ్ ప్రొసీజన్ జరుగుతున్నట్లు సమాచారం. రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం కలదట.
రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వెట్టయాన్ విడుదలకు సిద్ధం అవుతుంది. టీజే జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున ఓ కీలక రోల్ చేయడం విశేషం.