Rajamouli- Kantara: కాంతార ఈ దశాబ్దపు సంచలనంగా సినిమా వర్గాలు అభివర్ణిస్తున్నారు. ఆ చిత్ర కంటెంట్, కలెక్షన్స్ ప్రత్యేకంగా నిలిపాయి. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించాడు. ఒక ట్రైబల్ తెగకు, భూస్వామికి మధ్య భూ హక్కు అనే అంశాన్ని తీసుకొని దానికి అడవి దేవత అనే నేపథ్యం జోడించి రిషబ్ శెట్టి సరికొత్తగా తెరకెక్కించారు. కాంతార పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు.

కెజిఎఫ్ మేకర్స్ కాంతార చిత్రాన్ని కేవలం రూ. 16 కోట్లతో నిర్మించారు. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేరు. ఒక బలమైన కథను అద్భుతంగా తెరకెక్కించి రిషబ్ శెట్టి దేశాన్ని ఆకర్షించాడు. చివరి 20 నిమిషాలు కాంతార చిత్రానికి ఆయువుపట్టు. పతాక సన్నివేశాల్లో రిషబ్ తన నటనతో ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లారు. క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన, మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా కాంతార చిత్రం ప్రేక్షకుల మదిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది.
కొన్ని చిత్రాలకు అన్ని అలా కలిసొస్తాయి. ఇక వరల్డ్ వైడ్ కాంతార రూ. 400 పైగా వసూళ్ళు సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో కాంతార చిత్రానికి ఆదరణ దక్కింది. తెలుగులో కాంతార చిత్ర రిలీజ్ హక్కులు కేవలం రూ. 2 కోట్లకు అల్లు అరవింద్ కొన్నారు. రన్ ముగిసే నాటికి రూ. 30 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. పెట్టుబడికి 15 రెట్లు లాభాలు తెచ్చింది. కాంతార చిత్ర బడ్జెట్… వసూళ్ల ప్రకారం రూ. 100 కోట్ల బడ్జెట్ రూ. 2000 కోట్లు వసూలు చేసినట్లు లెక్క.

ఇదే విషయాన్ని రాజమౌళి తాజాగా ప్రస్తావించారు. రాజమౌళి, కమల్ హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంతార చిత్రం చర్చకు వచ్చింది. రాజమౌళి మాట్లాడుతూ… వందల కోట్ల వసూళ్లు రాబట్టాలంటే భారీ స్కేల్ తో చిత్రాలు చేయాలని భావించేవాళ్ళం. ఈ ఆలోచన కాంతార ఒక్కసారిగా మార్చేసింది. చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా వందల కోట్ల వసూళ్లు సాధించగలవని నిరూపించింది. ఒక ప్రేక్షకుడిగా కాంతార చిత్రాన్ని ఎంజాయ్ చేస్తాము. దర్శకుడిగా మాత్రం ఆలోచన మార్చుకోవాలి. అసలు మేము ఏం చేస్తున్నామని వెనక్కి వెళ్లి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా భారీ బడ్జెట్ చిత్రాలు తీసే తన ఆలోచన కాంతార మూవీ మార్చేసిందని, అభిప్రాయపడ్డారు.