Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే గుట్టు చప్పుడు కాకుండా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకి రాకపోవడం గమనార్హం. మీడియా ని మాత్రమే కాదు, కనీసం మొబైల్ ఫోన్స్ కి కెమెరాలను కూడా రాజమౌళి లొకేషన్ లోకి తీసుకొని వచ్చేందుకు అనుమతించలేదట. అంత గోప్యంగా ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగిన రోజే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు రాజమౌళి. ఈ ఈవెంట్ లో ఆయన మహేష్ తో చేయబోయే సినిమా గురించి యాంకర్ సుమ అడగగా, ఇప్పుడు ఎందుకులే దాని గురించి, మళ్లీ మాట్లాడుకుందాం అని అంటాడు రాజమౌళి. ఆ తర్వాత రామ్ చరణ్ తో జరిగిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో యాంకర్ సుమ రాజమౌళి చిత్రం గురించి పలు ప్రశ్నలు వేస్తుంది.
మహేష్ గారితో రాజమౌళి గారు చేస్తున్న సినిమా ఎన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మీరు అనుకుంటున్నారు అని రామ్ చరణ్ ని అడగగా, దానికి ఆయన సమాధానం ఇస్తూ ‘ఎలాంటి అడ్డంకులు రాకపోతే, ఏడాదిన్నర లోపే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు’ అంటూ రాజమౌళి వైపు చూసి ‘ఏమి సార్..నమ్మకాలు పెట్టుకోవచ్చు అంటారా?’ అని అడుగుతాడు రామ్ చరణ్. అప్పుడు రాజమౌళి ‘పర్లేదు..నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చా’ అని అంటాడు. అంటే పరోక్షంగా కనీసం మూడేళ్ళ సమయం పడుతుందని రాజమౌళి ఉద్దేశ్యం. అభిమానులకు కూడా ఆయన మా సినిమా తొందరగా వస్తుందని ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అంటూ హింట్ ఇచ్చినట్టు అయ్యింది. అయినప్పటికీ కూడా అభిమానులు రామ్ చరణ్ ఇచ్చిన భరోసా ని బలంగా నమ్ముతున్నారు.
పూజ కార్యక్రమం జరిగిన తర్వాత వరుసగా రెండు రోజుల నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూటింగ్ జరుగుతుంది. మహేష్ తో పాటు పలువురు కీలక నటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో ఉంటుందని అంటున్నారు. దీని కోసం రాజమౌళి గత ఆరు నెలలుగా లొకేషన్స్ కోసం తన బృందం తో కలిసి వెతికాడు. అమెజాన్ అడవుల్లో కూడా ఆయన చాలా రోజుల వరకు పర్యటించాడు. ఈ చిత్రం తో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మన తెలుగు సినిమాని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనేదే రాజమౌళి లక్ష్యం. #RRR చిత్రం తో ఆస్కార్ అవార్డు ని అందుకొని హాలీవుడ్ మొత్తం మన వైపుకు చూసేలా చేసిన రాజమౌళి, ఈ చిత్రం తో వసూళ్ల పరంగా కూడా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడబోతున్నాడు. చూడాలి మరి ఆయన లక్ష్యాన్ని ఎంత వరకు రీచ్ అవుతాడు అనేది