Rajamouli On ANR: లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి నేడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేడుకలు నిర్వహించారు. ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏఎన్నార్ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. నాగార్జున, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజమౌళి, మహేష్ బాబు, రామ్ చరణ్, జగపతిబాబు, బ్రహ్మానందం, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, జయసుధ, టి సుబ్బిరామిరెడ్డి తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు ఏఎన్నార్ శతజయంతి వేడుకకు హాజరై నివాళులు అర్పించారు.
అనంతరం రాజమౌళి ఏఎన్నార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్ చిత్రాలు చూస్తూ, ఆరాధిస్తూ పెరిగాను కానీ ఆయనతో నాకు చెప్పుకోదగ్గ అనుబంధం లేదు. అయితే ఓ ఈవెంట్ కి ఆయనతో పాటు నేను కూడా హాజరయ్యాను. స్టార్ట్ కావడానికి కొంచెం సమయం ఉండటంతో ఏఎన్నార్, నేను ఒక గదిలో వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను ఓ ప్రశ్న ఆయన్ని అడిగాను.
దేవదాసు మూవీతో మీరు స్టార్ అయిపోయారు. అలాంటిది మిస్సమ్మలో కమెడియన్ రోల్ చేశారెందుకు అన్నాను. అది నేను కావాలని అడిగి చేసిన పాత్ర అని ఆయన అన్నారు. చక్రపాణి, నాగిరెడ్డి నాకు అత్యంత సన్నిహితులు. మిస్సమ్మ కథ చెప్పినప్పుడు కామెడీ డిటెక్టివ్ రోల్ నేను చేస్తాను అన్నాను. నీ ఫ్యాన్స్ తంతారయ్యా బాబు అని నాగిరెడ్డి, చక్రపాణి అన్నారు. కాదు నాకు అన్నీ తాగుబోతు పాత్రలే వస్తున్నాయి. నా ఇమేజ్ మారాలంటే ఇలాంటి పాత్ర చేయడం అవసరం అన్నాను.
అలా అడిగి మరీ మిస్సమ్మలో నటించాను అని ఏఎన్నార్ నాకు చెప్పారు. స్టార్ అయ్యుండి మరొక స్టార్ పక్కన అలాంటి పాత్ర చేయాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. నాకు ఏఎన్నార్ మాటలు విన్నాక గొప్పగా అనిపించింది. అలాగే కుటుంబాన్ని, వృత్తిని వేరుగా చూడాలనే విషయంలో కూడా ఆయన మన అందిరికీ స్ఫూర్తిగా నిలిచారు… అంటూ రాజమౌళి తన ప్రసంగం ముగించారు. రాజమౌళి కామెంట్స్ వైరల్ గా మారాయి. మిస్సమ్మ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది. ఆ చిత్రంలో ప్రతి పాత్ర అలరిస్తాయి.