
తెలుగు చిత్ర సీమలో టాప్ డైరెక్టర్ గా ఉన్నాడు రాజమౌళి. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాపు లేకుండా.. వరుస హిట్లు అందుకుంటూ వెళ్తున్న రాజమౌళి.. ప్రతీ సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తుండడం విశేషం. అయితే.. బాహుబలి తర్వాత దర్శక ధీరుడి రేంజ్ ప్రపంచ స్థాయికి చేరింది. ఇప్పటి వరకు చాలా మంది ఈ మాట అన్నారు. ఇప్పుడది అక్షరాలా నిజమైంది. త్వరలోనే రాజమౌళి ఓ హాలీవుడ్ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
బాహుబలితో తన కెరీర్ గ్రాఫ్ ను ఎవరెస్టు స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. దీంతో.. ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే.. ఆ క్యూరియాసిటీ ఏ మాత్రం తగ్గకుండా ఆర్ ఆర్ ఆర్ ప్లాన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో.. వీరిద్దరినీ ఎలా చూపించాడో చూడాలని సగటు ప్రేక్షకుడు కూడా ఆసక్తిగా ఉన్నాడు.
ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మహేష్ మూవీ రాబోతోందని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. అందరూ తమ ఇమాజినేషన్ కు పదును పెడుతున్నారు. మహేష్ ను ఎలా చూపించబోతున్నాడా అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. జక్కన్న హాలీవుడ్ సినిమా తీయబోతున్నాడని వచ్చిన వార్త సంచలనం రేకెత్తిస్తోంది.
అయితే.. ఇదేదో ఊహాజనితమైన వార్తకాదని, రూమర్ అంతకన్నా కాదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఒకటి రాజమౌళిని కలిసిందని, సినిమా తీసేందుకు అగ్రిమెంట్ కూడా కుదిరిందని వార్తలు వస్తున్నాయి.
అయితే.. రాజమౌళి హాలీవుడ్ కు వెళ్లి సినిమా చిత్రీకరించేది ఏమీ ఉండదట. ఇండియాలోనే ఇంగ్లీష్ సినిమా తీస్తారట. హాలీవుడ్ టెక్నీషియన్లతో తెరకెక్కిస్తారట. ఇందుకోసం కథకూడా సిద్ధమైందని, ఈ చిత్రానికి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాదే కథ సిద్ధం చేసినట్టు సమాచారం.
కాగా.. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రాజమౌళి టీమ్ కన్ఫామ్ చేసింది కూడా. మరి, ఈ రెండిట్లో ఏది ముందు సెట్స్ పైకి వెళ్తుందన్నది సస్పెన్స్. అయితే.. మహేష్ మూవీ తర్వాత హాలీవుడ్ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.