Pushpa 2 Producer : స్టార్ హీరో మూవీ విడుదల ఉంటే… హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద భారీ హంగామా నెలకొంటుంది. ఆ థియేటర్ లో సినిమా చూసేందుకు అభిమానులు ఎగబడతారు. పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల చేశారు. అయితే ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ వద్ద వేలలో అభిమానులు గుమిగూడారు. అల్లు అర్జున్ తన అభిమానులను నేరుగా కలిసేందుకు అక్కడకు వచ్చారు. ఫ్యాన్స్ తో కలిసి పుష్ప 2 మూవీ చూశారు.
కాగా సంధ్య థియేటర్ వద్దకు విపరీతంగా క్రౌడ్ చేరుకున్నారు. అభిమానులను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారని సమాచారం. గుంపులుగా అభిమానులు పరుగెత్తగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రేవతి అనే 35ఏళ్ల మహిళ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. బాలుడికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది.
ఈ ప్రమాదం పై నిరసనలు వ్యక్తమయ్యాయి. అల్లు అర్జున్, పుష్ప 2 నిర్మాతలు బాధ్యత వహించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో పుష్ప 2 నిర్మాతలు స్పందించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పుష్ప 2 స్క్రీనింగ్ సమయంలో తొక్కిలాసట జరిగి, మహిళ ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాము. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చేస్తాము. బాలుడు కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మేము ప్రార్దిస్తున్నాము.. అని తెలియజేశారు.
హీరోల బర్త్ డే లకు, సినిమా రిలీజ్ లకు ఫ్లెక్సీలు కడుతూ మృత్యువాత పడిన అభిమానుల సంఖ్య చాలా పెద్దది. మితిమీరిన అభిమానం కూడా అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే అభిమానులకు స్టార్ హీరోలు అవగానే కలిపించాల్సిన బాధ్యత ఉంది. పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టీమ్ కి మహిళ మరణం, ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది.
కాగా పుష్ప 2 చిత్రానికి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఈ మూవీ ఫస్ట్ డే రూ. 250 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసిన తీరు ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది. పుష్ప 2 అనేక ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం.