Mahesh Rajamouli Movie First Look: కోట్లాది మంది అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మహేష్(Superstar Mahesh Babu),రాజమౌళి(SS Rajamouli) మూవీ అప్డేట్ వచ్చే నెలలో రాబోతుంది. హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ ని ప్లాన్ చేసి, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్, గ్లింప్స్ వీడియోలను విడుదల చెయ్యనున్నారు. నవంబర్ 11 లేదా నవంబర్ 15న ఈ ఈవెంట్ ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా షూటింగ్ మొదలై ఆరు నెలలు దాటింది. ఈ ఆరు నెలల్లో కేవలం 40 రోజులు మాత్రమే షూటింగ్ జరిగింది. మొదటి షెడ్యూల్ ని ఒడిశా లో కొన్ని రోజులు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో రెండవ షెడ్యూల్ చేశారు. అందుకోసం వారణాసి సెట్స్ కూడా వేశారు.
ఇక ఆ తర్వాత శంకరపల్లి లో కొన్ని రోజులు షూటింగ్ జరిపిన మూవీ టీం, సుదీర్ఘ విరామం తీసుకొని, సౌత్ ఆఫ్రికా కి వెళ్లి ఒక 20 రోజుల షెడ్యూల్ ని పూర్తి చేశారు. దాదాపుగా పాతిక శాతం మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్టు తెలుస్తుంది. ఇంత షూటింగ్ జరిగితే, కనీసం చిన్న అప్డేట్ కూడా ఇవ్వడం లేదని అభిమానుల్లో చిన్న అసంతృప్తి ఉండేది. అలాంటి సమయం లో ఈ ఏడాది ఆగష్టు 9 న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని కనీవినీ ఎరుగని రేంజ్ చేస్తామని రాజమౌళి అధికారిక ప్రకటన చేసాడు. దీంతో అభిమానులు శాంతించారు. ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చినా రికార్డ్స్ గల్లంతు అవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ చిత్రానికి రికార్డ్స్ విషయం లో ఫస్ట్ లుక్ నుండే భారీ టార్గెట్స్ ఉన్నాయి.
ఈ చిత్రం ముందు ఉన్న అతి పెద్ద టార్గెట్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2′(Pushpa 2 : The Rule) ఫస్ట్ లుక్ లైక్స్ రికార్డు. పుష్ప 2 లోని జాతర ఎపిసోడ్ లో అల్లు అర్జున్ చీర కట్టుకున్న లుక్ ని ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కి ట్విట్టర్ రెండు లక్షల 85 వేల లైక్స్, 14 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మహేష్, రాజమౌళి మూవీ ఫస్ట్ లుక్ ఈ రికార్డు ని బద్దలు కొడుతుందా లేదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సాధారణంగానే మహేష్ మూవీ అప్డేట్స్ అంటే రికార్డు స్థాయి రీచ్ రావడం సహజం, పైగా ఇంత పెద్ద పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అంటే, కచ్చితంగా పుష్ప 2 ఫస్ట్ లుక్ రికార్డుని బద్దలు కొడుతుందని మహేష్ ఫ్యాన్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.