Puri Musings by Puri Jagannadh: ఒక సినిమా విజయ వంతం కావడానికి దర్శకుడి పాత్ర చాలా కీలకం. మన తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది నైపుణ్యం కలిగిన దర్శకులు ఉన్నారు. కానీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ( Puri Jagannad) క్రేజ్ వేరు. ఎందుకంటే టాలీవుడ్ దర్శకులందరిదీ ఒక దారి అయితే, పూరీది మరో దారి. సినిమాను తెరకెక్కించడంలో పూరిది సెపరేట్ స్టైల్. పూరి అంటేనే డాషింగ్ అండ్ డేర్ డైరెక్టర్. అందుకే పూరి ఏ సినిమా చేసినా… ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.
యాక్షన్ సినిమాల్లో సెంటిమెంట్ ను పండించగలడు. సెంటిమెంట్ సినిమాలో అద్భుతమైన ఫైట్లూ చేయించగలడు. పూరీ మొదటి సినిమా బద్రి నుంచి సూపర్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ వరకు దాదాపు 30కి పైనే సినిమాలు తెరకెక్కించారు. అందులో కొన్ని బాక్సాఫీసు రికార్డులను బద్దలుకొట్టాయి. మరికొన్ని చతికిలపడ్డాయి.
ఎన్నడూ హిట్ వచ్చింది కదా అని పొంగిపోలేదు. ఫ్లాప్ అయింది కదా అని వెనకడుగూ వేయలేదు. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలనే ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు పూరి. ఒకవిధంగా టాలీవుడ్ హీరోకి ఓ ప్రత్యేక హీరోయిజం నేర్పింది పూరీ జగన్నాథ్ నే. అప్పటి వరకు క్లాస్ సినిమాల హీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ లను మాస్ హీరోలుగా మార్చాడు.
బద్రి సినిమా పవన్ కెరీర్ ను మలుపు తిప్పితే… మహేశ్ కెరీర్ లో పోకిరీ, బిజినెస్ మ్యాన్ చాలా ప్రత్యేకమైన సినిమాలుగా నిలిచాయి. ఇక రెండో హీరో, విలన్ పాత్రలు చేస్తున్న రవితేజను తన సినిమాలతో స్టార్ ను చేశాడు. ఇక టెంపర్ తో ఎన్టీఆర్ కి మళ్ళీ ప్లాప్ అనేది లేకుండా గట్టి పునాది వేశాడు.
మొత్తానికి పూరీ సినిమాల్లో హీరో చాలా ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఎవరినీ లెక్క చేయకుండా.. దేన్నీ లక్ష్య పెట్టనట్టుగా ఉంటాడు. కాస్త సైలెంట్ గా ఉంటూనే, అంతలోనే తన అంత వైలెంట్ ఉండడు అన్నట్టుగానూ మారిపోతాడు. అందుకే దర్శకుడిగానే కాదు.. వ్యక్తిగా కూడా పూరీని చాలామంది ఇష్టపడతారు. ఆయన మాటలు వింటే చాలా ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అని అంటూ ఉంటారు ఇండస్ట్రీ జనాలు.
పైగా ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ ఎలాంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతూ ‘మోడ్రన్ ఋషి’గా పూరి కొత్త జనరేషన్ కు తన మాటలతో గొప్ప పాఠాల చెబుతున్నాడు. అయితే, ఈ మధ్య ‘పూరీ మ్యూజింగ్స్’ నుంచి ఏమి రిలీజ్ కాలేదు. దాంతో ఆయన లక్షల మంది ఫాలోవర్స్ ‘పూరీ మ్యూజింగ్స్’లో కొత్త టాపిక్ తో రావాలని సోషల్ మీడియాలో పూరిని రిక్వెస్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.