‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తెలియని ఎన్నో విషయాలను తెలియజేసే క్రమంలో ఈ రోజు కొత్త టాపిక్ తో వచ్చాడు. టాపిక్ ఏమిటంటే ‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’. అవును దీని గురించి చాలా మందికి తెలియదు. మరి పూరి మాటల్లోనే విందాం. ‘‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’.. నాగరిక ప్రపంచానికి దూరంగా బతకడం, ఎక్కడో ప్రకృతిలో కలిసిపోయి బతకడం. క్లారిటీగా చెప్పుకుంటే మంచినీళ్లు, కరెంటు, గ్యాస్, ఇంటర్నెట్.. ఇలాంటి ఏ వసతులు లేకుండా బతకడం. అంటే స్వయం సమృద్ధ జీవనశైలి టైప్ అన్నమాట.
అయితే, ఈ గోయింగ్ ఆఫ్ ది గ్రిడ్ అనేది కేవలం కొంతమంది మాత్రమే చేయగలరు. ముందు అలా చేయాలంటే సరైన ప్రదేశాన్ని చూసుకోవాలి, అక్కడ ఒక ఇల్లు నిర్మించుకోవాలి. సోలార్ లాంటి పవర్ సోర్సులు పెట్టుకుని.. కుదిరితే వర్షం నీటిని సైతం ఉపయోగించుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక ఈ ‘‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’ను ఫాలో అయ్యేవాళ్లు కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి. అన్నిటికి మించి వాళ్ల ఆహారాన్ని వాళ్లే పండించుకుని తింటారు.
పశువులు, కోళ్లను పెంచుకుంటూ.. అన్నిరకాల చెట్లతో పాటు ధాన్యం కూడా పండిస్తారు. అప్పుడు అన్ని వాళ్లకు దొరుకుతాయి. ముఖ్యంగా వాళ్లకి కరెన్సీతో పని ఉండదు. అసలు అప్పులు లేని జీవితం. పైగా ప్రతినెలా ఎవ్వరికీ బిల్లులు కట్టాల్సిన పనే లేదు. మీకు తెలుసా ‘ప్రపంచంలో 35 మిలియన్ల మంది ఇలా ‘ఆఫ్ ది గ్రిడ్’ జీవనాన్ని కొనసాగిస్తున్నారని. వీళ్లంతా పర్యావరణం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు. పైగా ఆరోగ్యంగా, అలాగే సంతోషంగా కూడా ఉంటారు.
మన పూర్వీకులు ఇలాగే ఎన్నో వేల సంవత్సరాలు బతికారు. అందుకే పాత రోజుల్లో మన భూమి ఎంతో పచ్చగా ఉండేది. 100 డైనోసార్లు అడవిలో పుట్టి అదే అడవిలో చనిపోతే ఈ ప్రకృతికి ఏం కాదు. కానీ నలుగురు మనుషులు బతికి చనిపోతే అప్పటికే అడవి సగం నరికేసి ఉంటుంది. అందుకే ప్రకృతి మన పై గుర్రుగా ఉంటుంది. నిజానికి మనకి ప్రకృతిలో బతకడం రాదు. ఇప్పటికైనా మనందరం ఆఫ్ గ్రీడ్ గా జీవించాలి. కరోనా వైరస్ లు లాంటి నుంచి దూరంగా సంతోషంగా బతకాలంటే ఇది ఒక్కటే మార్గం.
మన భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉంటుంది. మీ పిల్లలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే అది ఇదే అని గుర్తుపెట్టుకోండి. నీటిలో చేపల్లాగా, గాలిలో పక్షుల్లాగా, అడవిలో జంతువుల్లాగా.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఫ్రీగా హాయిగా బతికే మార్గం ఈ ఆఫ్ ది గ్రిడ్. కాబట్టి, వెనక్కెళ్లి బతుకుదాం. ముందుకెళ్లి పీకేది ఏమీ లేదు’’ అని పూరి తన శైలిలో చెప్పుకొచ్చాడు.
