Puneeth Rajkumar: ఈ భూమ్మీద సగటున నిమిషానికి ఏడుగురు జన్మిస్తారు. నలుగురు చనిపోతారు. అంటే.. రోజుకు 10 వేల మందికి పైగా పుడితే.. ఐదున్నరవేల మందికి పైగా మట్టిలో కలిసిపోతుంటారు. వీరిలో సింహభాగం ఎప్పుడు పుటారో.. ఎప్పుడు గిట్టారో ఈ ప్రపంచానికి తెలియదు. కానీ.. కొందరుంటారు.. మరణించిన తర్వాత కూడా జనాలా హృదయాల్లో బతికే ఉంటారు. శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు. ఎందుకంటే.. వారు తమకోసం మాత్రమే కాదు.. సమాజం కోసం బతికిన వారు. అభాగ్యులకోసం ఆరాటపడిన వారు.. నిర్భాగ్యులకోసం జీవించిన వారు. అలాంటి వారిలో ఒకరు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్! ఆయన బతికున్నప్పుడే కాదు.. చనిపోయిన తర్వాతా తాను చేస్తున్న సేవ ఆగకూడదని తీసుకున్ననిర్ణయం అందరి గుండెలూ బరువెక్కేలా చేస్తోంది.

పునీత్ మరణించే వరకు తన సేవా కార్యక్రమాల గురించి ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. అందుకే ఇతర ప్రాంతాల వారికి పెద్దగా తెలియదు. కానీ.. ఆయనను కడసారి చూసేందుకు యావత్ భారత చిత్ర పరిశ్రమ కదిలి వచ్చినతీరు చూసి దేశం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పునీత్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టింది. అప్పుడే.. ఆయన సేవాగుణం.. దానగుణం ఒక్కొక్కటిగా వెలుగు చూడటం మొదలు పెట్టాయి.
ఇప్పటి వరకూ అందరూ విన్నది.. ఒక ప్రముఖుడు సేవ చేయడం అంటే ఓ వందమందిని చదివించడం గొప్ప విషయం. ఒక అనాథ ఆశ్రమాన్ని నడిపించడమే పెద్ద విషయం. కానీ.. కర్ణుడిని తలపించేలా పునీత్ చేసిన సేవ, దానం గురించి తెలిస్తే.. కన్నీళ్లు ఆగవనే చెప్పాలి.
ఒకటా? రెండా? ఉచిత విద్య అందించే స్కూళ్లు ఏకంగా 45 నడుస్తున్నాయి! 26 ఆశ్రమాలు అనాథలను గుండెల్లో దాచుకున్నాయి.. 16 వృద్ధాశ్రమాలు ముసలి ప్రాణాలను అక్కున చేర్చుకున్నాయి. 19 గోశాలలు.. ఆవులకు ఆధారమయ్యాయి. ఇవి కాకుండా.. మరో 1800 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తూ వచ్చారు పునీత్. ఇలాంటి సేవ చేసిన హీరోలను ఏ సినీ పరిశ్రమలోనైనా చూశారా అంటే.. లేదనే చెబుతారు. “ఈ భూమ్మీద, ఒక సంఘంలో కలిసి బతుకుతూ.. తోటివారికి సహాయం చేయకుండా బతకడం ఓ బతుకేనా” అన్న ఓ సినిమా డైలాగును నిజ జీవితంలో ఆచరించి చూపారు పునీత్. తన సంపాదనే కాదు.. చివరకు మరణించిన తర్వాత తన కళ్లు కూడా మరొకరికి వెలుగునివ్వాలని వాటిని కూడా దానం చేశారు.
Also Read: Avika ghor: చిన్నారి పెళ్లి కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఎవరు?
ఆయన ఒక లెజెండరీ హీరో కొడుకు, స్టార్ హీరో తమ్ముడు. అయినా కూడా.. ఎక్కడా.. దాన్ని చూపించలేదు. రీల్ హీరో ట్యాగ్ లైన్ అందరూ వేసుకోవచ్చు. కానీ రియల్ హీరో అనే ట్యాగ్ జనాలు ఇవ్వాలి. దాన్ని సగర్వంగా మెడలో ధరించిన నటుడు పునీత్. అలాంటి హీరో.. తాను లేకపోయినా.. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం.. ఏకంగా 8 కోట్ల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు పునీత్. పరులకోసం ఇంతగా తపించే సెలబ్రిటీని ఎక్కడైనా చూశారా? ఇలాంటి పునీత్ ను ఏమని పిలవాలి? ఎలా కీర్తించాలి? మీరే చెప్పండి.
Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి మరో బిగ్ అప్డేట్… ఈసారి డాన్స్ తో రఫ్ఫాడించనున్న ఎన్టీఆర్, చరణ్