Vijay Deverakonda: ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులకి దగ్గర అయ్యే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా మొదలెట్టాడు ఈ రౌడీ. అయితే ఇదే సమయంలో తాము విజయ్ సినిమా ద్వారా నష్టపోయామని మమ్మల్ని కూడా ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఖుషి సినిమా విజయం సాధించడంతో దానికి ప్రధాన కారణమైన తన అభిమానుల కుటుంబాలకు ఒక్కో లక్ష చొప్పున ఒక వంద కుటుంబాలకు సాయం చేయాలని భావించాడు విజయ్. వైజాగ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ “నా మీద, నా సినిమా మీద కావాలని నెగిటివిటీ తీసుకొని రావాలని కొందరు డబ్బులిచ్చి మరి ఫేక్ రివ్యూస్ వచ్చేలా చేశారు. కానీ వాటన్నిటినీ దాటుకొని ఈ సినిమా సక్సెస్ అయిందంటే దానికి కారణం నా అభిమానులు. అందుకే నా సంపాదనలో వాళ్ళకి భాగం ఇవ్వాలని అనుకుంటున్నా ” అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు కూడా షురూ అయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్ ‘ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసినందుకు మాకు దాదాపు 8 కోట్లు నష్టం వచ్చింది. ఆ సమయంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఖుషి సినిమా హిట్ అయ్యాక కోటి రూపాయలు ఇస్తామని పెద్ద మనసు చాటుకున్నారు. అదే విధంగా నష్టపోయిన ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల ఫ్యామిలీలను కూడా ఆదుకోండి అని అభిషేక్ పిక్చర్స్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు పెట్టారు.
దీనితో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. విజయ్ ఫ్యాన్స్ ఈ పోస్ట్ పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్ హీరోను అయితే ఇదే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అడిగే దమ్ము ఆ నిర్మాణ సంస్థ కు ఉందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దానికి కౌంటర్ ఇస్తూ విజయ్ దేవరకొండ ట్రెండ్స్ పోస్ట్ చేసింది.
డియర్ అభిషేక్ పిక్చర్.. వరల్డ్ ఫేమస్ లవర్ బిజినెస్ అగ్రిమెంట్ NRA బేసిస్‌లో జరిగింది. కాబట్టి బిజినెస్ తో సంబంధం లేని హీరో మీరు చెప్పిన నష్టాన్ని ఎందుకు భరించాలి ? మీరు వెస్ట్ గోదావరి జిల్లాలో అర్జున్ రెడ్డి సినిమా డిస్టిబ్యూషన్ చేసి భారీ లాభాలు తెచ్చుకొన్నారు. వాటిని మీరు తిరిగి ఇచ్చారా? అని ప్రశ్నించారు. మీకు విజయ్ దేవరకొండను టార్గెట్ చేయాలను కుంటే..ముందుగా ప్రొడ్యూసర్ల నుంచి ఏదైనా సమాచారం అడిగి తెలుసుకోండి అని ట్వీట్ చేశారు.