టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఉన్నారు. కానీ.. వారిలో స్టార్ డైరెక్టర్స్ మాత్రం కొద్ది మందే. అందుకే.. వారి డేట్స్ ఓ పట్టాన దొరకని పరిస్థితి. నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. దర్శకులు మాత్రం అందుబాటులో ఉండట్లేదు. దీంతో.. అడ్వాన్స్ గా ఆలోచించి, అడ్వాన్సులు చేతిలో పెట్టేస్తున్నారు ప్రొడ్యూసర్లు!
దర్శకులు ప్రస్తుతం చేస్తున్న సినిమా కంప్లీట్ కాకుండానే.. వచ్చే సినిమా తమతోనే చేయాలని వారి నుంచి మాట తీసుకుంటున్నారు నిర్మాతలు. ఇవాళ రేపు నోటి మాటను ఎవరు పట్టించుకుంటారు? అందుకే.. ‘నోటు మాట’ తీసుకుంటున్నారు. అడిగినంత అడ్వాన్సు ఇచ్చేసి, బాండ్ రాసుకుంటున్నారు. అలాగైనా.. తమతో సినిమా గ్యారంటీ అవుతుందని భావిస్తున్నారు.
అయితే.. సదరు డైరెక్టర్ అప్పటికే ఒక సినిమా కమిట్ అయి ఉంటే.. దాని తర్వాతైనా తమ సినిమా చేయాలంటూ అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా ప్రతీ దర్శకుడి వద్ద.. కనీసం రెండుకన్నా ఎక్కువ అడ్వాన్సులు ఉన్నట్టు సమాచారం. మినిమమ్ 10 లక్షలకు తగ్గకుండా అడ్వాన్సులు ఇస్తున్నారట.
తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వస్తోందనేది నిర్మాతల మాట. పేరున్న దర్శకులకే హీరోలు డేట్స్ ఇస్తున్నారు. డైరెక్టర్లేమో ఖాళీగా ఉండే పరిస్థితి కనిపించట్లేదు. ఒక సినిమా తర్వాత మరొకటి అనుకుంటూ బడా బ్యానర్లలోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో.. మిగిలిన నిర్మాతలకు వారు సినిమాలు తీసిపెట్టే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే.. అడ్వాన్సులు ఇచ్చేసి, ముందుగానే కర్చీఫ్ లు వేసుకుంటున్నారు.
ఈ విధంగా.. డైరెక్టర్ల కొరత ఇండస్ట్రీలో చాలా ఉందని స్పష్టమవుతోంది. దీంతో.. ఒక్కసినిమా హిట్టుకొట్టినా సరే.. అతన్ని అడ్వాన్సుతో కొట్టేస్తున్నారు ప్రొడ్యూసర్స్. అయితే.. అన్ని అడ్వాన్సులూ వర్కవుట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? అంటే అనుమానమే. కోట్ల బిజినెస్ సాగే సినిమా రంగంలో నిర్ణయాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఇది వాస్తవమే అయినప్పటికీ.. నిర్మాతలకు మరో ఆప్షన్ లేదు మరి! అందుకే సూట్ కేసులు చేతిలో పట్టుకొని తిరుగుతున్నాకరట!!