
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత దేశంలో రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ఈ మధ్య రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి ధాటికి సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ ఇండస్ట్రీకి చెందిన పలువురిపై పంజా విసిరింది.
ఇప్పటికే చాలా మందికి వైరస్ సోకగా.. పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఆ జాబితాలో తాజాగా మరొకరు చేరారు. ప్రముఖ నిర్మాత అనిల్ సూరి కరోనా సోకి మరణించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రాజీవ్ సూరి ధ్రువీకరించారు. అనిల్ ఈ నెల 2వ తేదీ నుంచి హై ఫీవర్తో బాధపడుతున్నారన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో లీవావతి, హిందుజా ఆసుపత్రులకు తీసుకెళ్లామన్నారు. కానీ, అక్కడ అనిల్‌ను అడ్మిట్ చేసుకోలేదని తెలిపారు. దాంతో, బుధవారం ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చించగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ గురువారం సాయత్రం మృతి చెందారని రాజీవ్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అనిల్ అంత్యక్రియలు నిర్వహించారు. అనిల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిల్ సూరి.. రాజ్ కుమార్, రేఖ కలిసి నటించిన ‘కర్మయోగి’, ‘రాజ్ తిలక్’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కొద్ది రోజుల కిందటే ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.