https://oktelugu.com/

Prakash Raj: పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత కోపం.. ఎట్టకేలకు బయటపెట్టిన ప్రకాష్ రాజ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తరచుగా మాటల దాడికి దిగుతుంటాడు నటుడు ప్రకాష్ రాజ్. తిరుమల లడ్డు వివాదం వీరిద్దరి మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. తాజాగా పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ కీలక ఆరోపణలు చేశాడు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు నచ్చడం లేదో ఓపెన్ అయ్యాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : October 27, 2024 / 10:03 AM IST

    Prakashraj Comments

    Follow us on

    Prakash Raj: తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. శ్రీవారి ప్రసాదమైన లడ్డు తయారీకి జంతువుల కొవ్వు వాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసిన ఈ పరిణామం పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఆయన ప్రాయశ్చితం దీక్ష చేపట్టారు. తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలని పవన్ కళ్యాణ్ కోరారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

    పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. మీరు అధికారంలో ఉన్నారు. విచారణ చేపట్టి, తప్పు జరిగితే నిందితులను శిక్షించండి. దీన్ని రాద్ధాంతం చేయడం ఎందుకని, పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. అలాగే నటుడు కార్తీ తన మూవీ ప్రమోషన్స్ లో లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ మేటర్. దాని మీద మాట్లాడను అన్నారు.

    ప్రకాష్ రాజ్, కార్తీ తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అసలు ప్రకాష్ రాజ్ కి ఏం సంబంధం. సనాతన ధర్మాన్ని కాపాడుకునే హక్కు మాకులేదా?. మరొక నటుడు లడ్డు సెన్సిటివ్ మేటర్ అని ఎగతాళిగా మాట్లాడాడు. సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించాడు. ఈ క్రమంలో కార్తీ క్షమాపణలు చెప్పారు. ప్రకాష్ రాజ్ మాత్రం కౌంటర్లు వేయడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఓ వీడియో బైట్ విడుదల చేశాడు.

    నేను విదేశాల్లో ఉన్నాను. వచ్చాక మీ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెబుతాను. నా ట్వీట్ మీకు అర్థం కాలేదు అనుకుంటా.. మరోసారి చదవండని, ప్రకాష్ రాజ్ వీడియోలో మాట్లాడారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కౌంటర్లు వేశాడు. తాజాగా ఓ మీడియా సంస్థ ప్రకాష్ రాజ్ తో మాట్లాడింది. మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత కోపం అన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది.

    ఈ ప్రశ్నకు సమాధానంగా… పవన్ కళ్యాణ్ ది మూర్కత్వం. విధ్వంసక రాజకీయాలు చేస్తున్నారు. అది నాకు నచ్చడం లేదని అన్నారు. మరి ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు. వాళ్ళ మనోభావాల సంగతి ఏమిటని మరో ప్రశ్న అడగ్గా.. ప్రజలు ఎన్నుకుంది అందుకు కాదు. గెలిచాక గేర్ మారిస్తే ఎలా. ప్రశ్నించడానికి ఎవరో ఒకరు ఉండాలిగా… అని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రకాష్ రాజ్ బీజేపీ వ్యతిరేకి. బీజేపీకి మద్దతు తెలిపినందుకు పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ గతంలో కూడా విమర్శలు చేశాడు.

    ఒక్క శాతం ఓటింగ్ కూడా లేని బీజేపీతో పవన్ కళ్యాణ్ కలవాల్సిన అవసరం ఏముంది? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నన్ను తీవ్ర నిరాశకు గురి చేశాడని అన్నాడు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయ్యాడు. ప్రకాష్ రాజ్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.