Bear Attack: అభివృద్ధి పేరుతో గుట్టలను, కొండలను తొలచివేయడం మొదలుపెట్టిన తర్వాత.. అడవులను నరికి వేయడం ప్రారంభించిన తర్వాత.. జంతువులకు తలదాచుకునే చోటు లేకుండా పోయింది. అందువల్లే అవి ఊర్ల మీద పడుతున్నాయి. గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. కోతులయితే కిష్కింధ కాండను చూపిస్తున్నాయి. పంటచేలను నాశనం చేస్తున్నాయి. చివరికి రైతులపై దాడులకు పాల్పడుతున్నాయి. కోతులు మాత్రమే కాదు క్రూర మృగాల తాకిడి కూడా ఇటీవల పెరిగిపోయింది. పులులు, ఎలుగుబంట్లు, హైనాలు, తోడేళ్లు రావడం సర్వసాధారణంగా మారింది. మారుమూల గ్రామాల కాదు హైదరాబాదు నగరంలోనూ చిరుతపులల సంచారం పెరిగిపోయింది. గత ఏడాది చివర్లో హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో చిరుత పులి సంచరించడం కలకలం రేపింది. సమీప గ్రామాల్లో ప్రవేశించి.. చిరుత పులి పశువులను చంపితిన్నది. దానిని పట్టుకోవడానికి అధికారులు చాలా రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఇక ఆ ఘటన మర్చిపోయిన తర్వాత నిర్మల్ జిల్లాలో చిరుత పులి సంచారం కంగారు పెట్టించింది. నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి మారుమూల కొండపైకి తన మేకలను మేతకు తీసుకెళ్లగా.. చిరుత పులి ఆ మందపై పడింది. రెండు మేకలను తిన్నది. ఆ తర్వాత మేకల కాపరిపై దాడి చేసేందుకు రాగా.. అతడు చెట్టు పైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇక ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఓ గ్రామంలో చిరుతపులి సంచరించింది.. ఓ మిరప తోటలో నుంచి బయటికి వెళ్తుండగా ఓ యువకుడు వీడియో తీసి స్థానిక అటవీశాఖ అధికారులకు చూపించాడు. దీంతో వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఆ పాదముద్రలు చిరుత పులివని గుర్తించారు. చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో గ్రామంలో ఎవరు కూడా ఒంటరిగా బయటికి రాకూడదని అధికారులు చాటింపు వేశారు. ఈ ఘటనలు మర్చిపోకముందే.. నాగర్ కర్నూల్ జిల్లాలో మరో క్రూరమృగం సంచరించడం సంచలనంగా మారింది.
ఎలుగుబంటి సంచారం..
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలోని ఉడిమిళ్ళ సమీపంలో ఎలుగుబంటి సంచరించిందనే వార్తలు సంచలనాన్ని కలిగించాయి. కాళ్లమర్రి అడవిలో ఓ కాపరి గొర్రెలను మేపుతున్నాడు. అతనిపైకి ఎలుగుబంటి వచ్చి దాడి చేసింది. నల్లగొండ జిల్లా కాసరాజు పల్లి అనే గ్రామానికి చెందిన అంజయ్య కొద్దిరోజులుగా తన గొర్రెలను మేత కోసం నల్లమల్ల అటవీ ప్రాంతానికి తీసుకొచ్చాడు. శనివారం అతడు గొర్రెలను మేపుతుండగా ఎలుగుబంటి అంజయ్య పై దాడి చేసింది. ఈ ఘటనలో అతని తల, ముఖం పై తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని అచ్చంపేటకు తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగు కాకపోవడంతో అతడికి ఉత్తమ చికిత్స అందించేందుకు హైదరాబాద్ తరలించారు. అయితే అతడు గొర్రెలను మేపుతుండగా ఎలుగుబంటి అతడి సమీపంలోకి వచ్చింది. వెంటనే అతనిపై దాడి చేసింది. అతడి చేతిలో కర్ర ఉన్నప్పటికీ ఎలుగుబంటి ఎదురుదాడికి దిగింది. తలపై గట్టిగా కొట్టింది. తన చేతి గోర్లతో ముఖంపై గీరింది. దీంతో అంజయ్యకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అచ్చంపేట ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అతడిని హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆసుపత్రిలో అతడు అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నాడు. తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో అతడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు.