ప్రభాస్ అప్ కమింగ్ మూవీ రాధేశ్యామ్. ఆ మధ్యనే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. విడుదల కోసం జూలై 30న స్లాట్ కూడా బుక్ చేశారు. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. అందులో ప్రధానమైంది రీషూట్.
వాస్తవానికి.. ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాట పెండింగ్ లో ఉంది. ప్రభాస్-పూజాహెగ్డే నడుమ రొమాన్స్ నిండిన పాటను షూట్ చేయలేదు. అది మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. కత్తిరింపులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పాట షూట్ చేద్దాం అంటున్నాడట ప్రభాస్.
ఇదే కాకుండా.. సినిమాలో తనకు సంబంధించిన కొన్ని సీన్లు కూడా సరిగా రాలేదని, మరోసారి షూట్ చేస్తే ఇంప్రెషన్ మరింత బాగా ఉంటుందని కూడా అంటున్నాడట ప్రభాస్. దీంతో.. ఏం చేయాలో పాలుపోవట్లేదట నిర్మాతలకు. వాస్తవానికి యువి క్రియేషన్స్ అంటే.. ప్రభాస్ సొంత బ్యానర్ లాంటిది. ఆయన అడిగితే కాదనలేరు. కానీ.. అంతా డబ్బులతో కూడుకున్న వ్యవహారం కావడంతో కిందామీదా పడుతున్నారని తెలుస్తోంది.
కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా ఆగిపోయి చాలా నష్టం జరిగింది. ఇప్పటికే తెచ్చిన అప్పులు కుప్పలుగా మారిపోయాయి. వాటి వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ పాట షూట్ చేయాలంటే కనీసం ఐదారు రోజుల సమయం పడుతుంది. హీరోయిన్ డేట్స్ కూడా అడ్జెస్ట్ చేయాల్సి వస్తుంది. సీన్లు రీ-షూట్ చేయాలంటే మరికొంత టైమ్ తీసుకోవాలి. వీటన్నింటితో ఖర్చు మరింత పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారట నిర్మాతలు.
అయితే.. ప్రభాస్ ఖచ్చితంగా పట్టుబడితే మాత్రం పాటే కాకుండా.. రీషూట్ కూడా ఖాయం. అదే జరిగితే.. సినిమా మరోసారి వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. మరి, ఏం జరుగుతుంది అన్నది చూడాలి.