తెలుగులో సహజనటి అంటే జయసుధనే. సహజమైన హావభావాలతో అంతకుమించిన హోమ్లీ గ్లామర్ డాల్ గా ఆ రోజుల్లో యువతను ఆకట్టుకుంది. ఆ తరువాత కూడా హీరోలకు తల్లిగా నాయనమ్మగా మెప్పించింది. దక్షిణాదిలో సహజనటి గా తనకు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నా.. జయసుధ మాత్రం ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలను అవకాశాలను కోసం ప్రయత్నిస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంది. ఇక ప్రస్తుతం మళ్ళీ బిజీ అవ్వడానికి ప్లాన్ చేస్తోంది. అయితే ఈసారి బుల్లితెర పై ఈ సహజనటి తన నటనా చాతుర్యాన్ని చూపించబోతుంది.
పైగా రెగ్యులర్ సీరియల్ తో కాదు, ఆధ్యాత్మికతతో సాగే ఒక సీరియల్ లో జయసుధ నటిస్తోంది. అలాగే ఆమె చేస్తోన్న ఆ సీరియల్ కి నిర్మాత కూడా ఆమెనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీరియల్ విషయానికి వస్తే.. ఇది క్రిష్టియన్ గొప్పతనాన్ని చాటి చెప్పే సీరియల్ అని, యేసును నమ్ముకున్న ఒక మిడిల్ క్లాస్ తల్లి జీవితం కష్టాల నుండి ఎలా బయట పడింది ?, ఆమెకు యేసు ఎలాంటి సహాయం చేశాడు ? అసలు యేసు అంటే ఏమిటి ? ఆయనలో ఏకం అయిపోవడం ఎలా ? ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తూ సాగుతుందట ఈ సీరియల్.
మొత్తానికి జయసుధ మరో కొత్త అవతారంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటివరకు జయసుధను ఎన్నో రకాల పాత్రల్లో చుసిన ప్రేక్షకులు.. యేసును నమ్ముకున్న మిడిల్ క్లాస్ తల్లిగా కూడా చూడబోతున్నారు. 70వ దశకంలో హీరోయిన్ గా అడుగుపెట్టి ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో మెరిసి.. అప్పటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి మహానటుల సరసన ఆడిపాడి.. ఆ తరువాత కాలంలోనూ అక్క, తల్లి, పిన్నిగా ఇలా పలు సినిమాల్లో కీ రోల్స్ లో నటించి.. ఆయా పాత్రలకే వన్నె తెచ్చారు జయసుధ.
ఇన్నేళ్ల ఆమె కెరీర్ లో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన జయసుధ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఆమె సినిమాలు చేయడం విశేషం. అలాగే జయసుధ రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే కూడా అయ్యారు. అయితే గత మూడు సంవత్సరాల నుండి క్రిష్టియన్ మతం ప్రచార బాధ్యతలను చేపట్టింది జయసుధ.