
‘ఇండియాలో ఇప్పుడు రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి సోనూ సూద్. రెండు ఆదిపురుష్’. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్ట్ ఇది. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న వారందరికీ నటుడు సోనూసూద్ ఆపద్భాందవుడయ్యాడు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను వారి స్వస్థలాలకు తీసుకొచ్చి వారి పాలిట హీరోగా మారాడు ఈ వెండితెర విలన్. అందుకే సోషల్ మీడియాలో అతని పేరు మార్మోగుతోంది. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి ‘ఆదిపురుష్’ అనే మాట అందరి నోటా నానుతోంది. ఏ ఇద్దరు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ ఓ భారీ చిత్రం అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ‘చెడు మీద మంచి సాధించిన విజయ సంబురం’ అనేది ట్యాగ్ లైన్. ఇందులో ప్రభాస్ రాముడి గెటప్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. రామరావణుల యుద్ధం ఇతివృత్తంలో సినిమా ఉంటుందని, రూ. 500 పైచిలుకు బడ్జెట్తో టీ సిరీస్ దీన్ని తెరకెక్కించనుందని సమాచారం. కాగా ఈ మూవీ గురించి రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. ప్రభాస్ సరసన సీతగా జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్‌ను అనుకుంటున్నారని టాక్. తాజాగా ఈ చిత్రం గురించి ఇంకో ఇంట్రస్టింగ్ విషయం వెలుగు చూసింది.
Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !
ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ‘ఆదిపురుష్’ కాదట. కథ ఫైనల్ అయిన తర్వాత ఈ చిత్రానికి దర్శకుడు ఓం రౌత్, ప్రభాస్ ఫస్ట్ ‘అయోధి’ అనే పేరు పెట్టాలని నిర్ణయించారట. కానీ, రామ జన్మభూమి ఆయోధ్య పై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పేరు మార్చాలని డిసైటయ్యారని సమాచారం. అనేక చర్చల తర్వాత ‘ఆదిపురుష్’ పేరు ఖరారు చేశారట. మరో ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే ఈ మూవీలో హీరోగా తొలుత బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్ రోషన్‌ను అనుకున్నారట. ఓ రౌత్ అతనికి కథ కూడా చెప్పాడని, కానీ, హృతిక్ నుంచి సరైన స్పందన రాలేదు. దాంతో వెంటనే ప్రభాస్‌ను సంప్రదించారట. చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషన్ కుమార్ ‘రాధేశ్యామ్’కు కూడా సహ నిర్మాతగా ఉన్నారు. ఆయన చొరవతో ప్రభాస్‌కు ఓం రౌత్ కథ వినిపించగా.. మన డార్లింగ్ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రతినాయకుడు రావణాసురుడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అనుకుంటున్నారు. ఓం రౌత్ తీసిన ‘తానాజీ’లో సైఫ్ విలన్‌గా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్కు అతడిని ఎంపిక చేస్తే బాలీవుడ్ మార్కెట్‌కు ప్లస్ అవుతుందని ఓం రౌత్ భావిస్తున్నాడట. సైఫ్ కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు మరో ఐదారు భాషల్లో నేరుగా రిలీజ్ కానుంది.