పూజా హెగ్డే హీరోయిన్ గా , పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పీరియాడికల్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయమొకటి బయటికి వచ్చింది. ఈ సినిమా తెలుగు బ్లాక్ బస్టర్ ఫార్ములా అయిన పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతుందట. అందులో భాగంగా ప్రభాస్ యంగ్ లుక్ తో పాటు ముసలివాడి గాను కనపడతాడని తెలుస్తోంది. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన మూగమనసులు నుండి రామ్ చరణ్ నటించిన మగధీర వరకు పునర్జన్మల కధాంశాలతోనే ఎందరో దర్శకులు విజయం సాధించారు.
ఇక ప్రభాస్ ఈ 20వ సినిమాని త్వరత్వరగా పూర్తి చేద్దామంటే.. కరోనా వైరస్ పెద్ద అడ్డంకిగా మారింది. దాంతో ఈ సినిమా షూటింగ్ ఆపాల్సి వచ్చింది. అయితే ముఖ్యమైన ఈ సినిమాకి కీలకమైన జార్జియా షెడ్యూల్ ని మాత్రం పూర్తి చేసుకున్నారు. ఇక ఇటలీలో చిత్రీకరించాల్సిన షూటింగ్ పార్ట్ ని మాత్రం ఇక్కడే హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో వేసిన భారీ సెట్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనుకున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది కి వెళ్ళిపోయింది.
ఇన్ని అవాంతరాల నడుమ అభిమాన ప్రేక్షకుల్నిసంతోష పరిచేందుకు త్వరలోనే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రానికి ` రాధాశ్యామ్ `, `ఓ మైడియర్ ` అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణా మూవీస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మితమవుతోన్న ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న మూడో పాన్ ఇండియా చిత్రమిది.