Navdeep: డ్రగ్స్ గుట్టు నవదీప్ ఫోన్ లో.. అది ఓపెన్ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి..

ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసుల్లో పలువురు నిర్మాతలు, యువ దర్శకులు అరెస్టు అవడం కలకలం రేపుతోంది.

Written By: Bhaskar, Updated On : September 27, 2023 2:09 pm

Navdeep

Follow us on

Navdeep: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్ పేరు కీలకంగా వినిపిస్తోంది. ఆయన ఈ డ్రగ్స్ వ్యవహారంలో సూత్రధారి అని తెలంగాణ నార్కోటిక్స్ విభాగం ప్రధానంగా అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో ఈ డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించి కీలకమైన సమాచారం నవదీప్ ఫోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల నవదీప్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైనప్పుడు తన అతి తెలివితేటలు ప్రదర్శించాడు. తన తల్లి ఫోన్ తీసుకెళ్లి పోలీస్ అధికారులను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించాడు. అందుకే నవదీప్ తన ఫోన్లు ఫార్మాట్ చేసిన విషయంలో నార్కోటిక్ డిఎస్పి సునీతా రెడ్డికి అనుమానం వచ్చింది. వెంటనే ఆ ఫోన్లోనే కీలక సమాచారం ఉందని భావించి.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్ వచ్చాక ఈ దందాలో ఎవరెవరు ఉన్నారో మొత్తం బయటికి వస్తుందని నార్కోటిక్ డిఎస్పి సునీత రెడ్డి చెప్తున్నారు. విచారణ సమయంలో నవదీప్ ఫోన్లను ఫార్మాట్ చేయడం, మీడియా ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు చెప్పాడు. నన్ను పిలిచారు, ప్రశ్నలు అడిగారు, సమాధానాలు చెప్పారు అని చాలా సులభంగా తేల్చేశాడు.

నవదీప్ కంటే ముందు.. నార్కోటిక్ పోలీసులు
దర్శకుడు మంతెన వాసు వర్మ, సినీ రచయిత మన్నేరి పృథ్వి కృష్ణను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70 గ్రాముల కొకైన్ తో పాటు భారీగా విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇదే డ్రగ్స్ వ్యవహారంలో రాయదుర్గం పోలీసులు నిర్మాత కె.వి చౌదరిని జూన్ నెలలాబ్అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే నెలలో మరో డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడం.. ఇందులో పెద్దపెద్ద తలకాయలు ఉన్నట్లు తేలడంతో టాలీవుడ్ లో ఒకసారి గా కలకలం చెలరేగింది. ఈ కేసులో వ్యాపారవేత్త అయిన వాసు వర్మ, పృథ్వి కృష్ణ నిందితులుగా ఉన్నారు. వాసు వర్మ బస్తి అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. అయితే వాసు వర్మ పరారీలో ఉండటం, అతడు సినిమా దర్శకుడు అనే విషయం తెలువకపోవడంతో కేసు పెద్దగా ఫోకస్ కాలేదు. అయితే వీరిద్దరిని మాదాపూర్ పోలీసులు 20 రోజుల క్రితమే అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. అయితే ముంబైకి చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ రాహుల్ అశోక వద్ద వీరిద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసుల్లో పలువురు నిర్మాతలు, యువ దర్శకులు అరెస్టు అవడం కలకలం రేపుతోంది. ఈ కేసులో నిర్మాత వెంకట రత్నారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. నవదీప్ తో పాటు డైరెక్టర్ శశాంక్, తిని పరిశ్రమతో సంబంధాలు ఉన్న ఉప్పలపాటి రవి, కలహర్ రెడ్డి సహా 50 మంది నిందితులను గుర్తించారు. అయితే పోలీసులకు టెక్నికల్ గా ఆధారాలు లభించకూడదని నవదీప్ తన మొబైల్ ఫోన్ లో డాటాను మొత్తం డిలీట్ చేసినట్టు తెలిసింది. అంతేకాదు తన ఫోన్ ను ఫార్మాట్ చేసుకుని విచారణకు హాజరయ్యారు. అయితే నవదీప్ కంటే ముందుగానే అతడి నెంబర్ కు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా 81 మంది అనుమానితులను గుర్తించారు. వారితో నవదీప్ కు లింకులు ఉన్నట్టు గుర్తించారు. వారిలో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు పబ్ నిర్వాహకులు, పార్టీలు నిర్వహించే ఆర్గనైజర్లు ఉన్నట్టు తెలిసింది. సుమారు 45 మంది వివరాలను నవదీప్ ద్వారా తెలుసుకున్న పోలీసులు మరో 36 మంది పై దృష్టి సారించారు. అయితే వారిలో ఎంతమందికి ఈ డ్రగ్స్ కేసుతో లింకులు ఉన్నాయి? వారికి నవదీప్ కు ఉన్న సంబంధం ఎటువంటిది? వారిలో ఎంతమంది పార్టీలకు వచ్చేవారు? ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతమంది? అనే విషయాల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీ తో సంబంధాలు ఉన్న కలహర్ రెడ్డి, ఉప్పలపాటి రవి, మరో పబ్ యజమాని సూర్య గత సోమవారమే నార్కోటిక్ బ్యూరో పోలీసుల విచారణకు హాజరయ్యారు. నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కలహర్ రెడ్డి నోరు విప్పారని, టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీల పేర్లు చెప్పారని సమాచారం. అయితే వారు చెప్పిన సమాచారం ఆధారంగా సెలబ్రిటీల గుట్టు రట్టు చేసే పనులు పోలీసులు పడ్డారని, అందుకు అనువైన ఆధారాలు సేకరిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు గతంలో సంచలనం సృష్టించిన బెంగళూరు డ్రగ్స్ కేసులో కలహర్ రెడ్డి అరెస్టు అయ్యారు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలతో పాటు, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు, తెలంగాణ రాజకీయ ప్రముఖులకు ఈ డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నట్టు తెలిసింది.