Homeఎంటర్టైన్మెంట్ఫ్యాన్స్‌ మార‌రా.. వీళ్ల‌ ప‌ద్ధ‌తి మార‌దా?

ఫ్యాన్స్‌ మార‌రా.. వీళ్ల‌ ప‌ద్ధ‌తి మార‌దా?

Mahesh Pawan

తాను చెడ్డ కోతి.. వ‌నం మొత్తం చెరిచింద‌న్న‌ది ఓ సామెత‌. హీరోల అభిమానుల్లోనూ ఇలాంటి ప‌నికిమాలిన‌ కోతులు ఉన్నాయి. ద‌శాబ్దాల క్రితం పోస్ట‌ర్ల మీద పేడ‌కొట్టే ద‌గ్గ‌ర్నుంచి.. ఇప్పుడు నెట్టింట నెగెటివ్ కామెంట్ల దాకా.. ట్రోల్ చేసే ట్రెండ్ మారిందిగానీ, వారి బుద్ధిమాత్రం మార‌ట్లేదు. మేమంతా ఒక్క‌టేరా నాయ‌నా.. మీరు త‌న్నుకొని చావ‌కండ్రా అని హీరోలు మొత్తుకుంటున్నా.. వీరికి వినిపించి చావ‌దు. త‌మ హీరోనే గొప్ప‌.. ఆయ‌న అభిమానులం కాబ‌ట్టి తామే గొప్ప అంటూ బుర‌ద‌లో బొర్లాడే వారు ఈ కాలంలోనూ త‌క్కువేం లేరు.

టాలీవుడ్లో ప్ర‌ధానంగా సాగే వార్ మెగా – నంద‌మూరి ఫ్యాన్స్ మ‌ధ్య‌నే అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. చిరంజీవి – బాల‌కృష్ణ జోరు కొన‌సాగే స‌మ‌యంలో ఓ రేంజ్ లో ఉండేది ఈ పంచాయ‌తీ. రాష్ట్రంలో న్యూస్ ఐట‌మ్ అయిన సంద‌ర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ త‌ర్వాత ప‌రిస్థితి కాస్త మారింది. వారి త‌ర్వాత‌.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో టాప్ స్టార్లుగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ – సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ మ‌ధ్య ఎక్కువ‌గా ఈ పంచాయ‌తీ క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర్కారువారి పాట సినిమాలో న‌టిస్తున్నారు. దీన్ని సంక్రాంతికి షెడ్యూల్ చేయాల‌ని అనుకున్నారు. ప‌వ‌న్ వీర‌మ‌ల్లు సినిమా కూడా స‌క్రాంతికి స్లాట్ బుక్ చేయాల‌ని అనుకున్నారు. ఇప్పుడు క‌రోనా కార‌ణంగా ఈ రెండు చిత్రాల షూట్‌ ఆగిపోయాయి. మ‌ళ్లీ ఎప్పుడు మొద‌లవుతాయో? ఈ రెండూ సంక్రాంతి బ‌రిలో నిలుస్తాయో లేదో కూడా తెలియ‌దు.

అయితే.. లేటెస్ట్ గా ప‌వ‌న్ ఫ్యాన్స్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట‌ర్ లో ట్రెండ్ చేశారు. దీంతో వెంట‌నే మ‌హేష్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. వాళ్లు కూడా డోంట్ మెస్ విత్ ఎంబీ అంటూ హ్యాష్‌ ట్యాగ్ ను లైన్లోకి తెచ్చారు. ఈ క్ర‌మంలో ఫ్యాన్ వార్ కూడా కొన‌సాగింది. దీంతో.. మ‌రోసారి అభిమానుల పంచాయ‌తీ తెర‌పైకి వ‌చ్చింది.

ప‌వ‌న్‌-మ‌హేష్ మ‌ధ్య స్నేహం ఎప్ప‌టి నుంచో ఉంది. అర్జున్ సినిమా స‌మ‌యంలో పైర‌సీపై జ‌రిగిన గొడ‌వ‌లో మ‌హేష్ కు ప‌వ‌న్ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు. ఈ మ‌ధ్య మ‌హర్షి సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌స్తే ప‌వ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ప‌వ‌న్ క‌రోనా వ‌స్తే.. కోలుకోవాల‌ని మ‌హేష్ ఆకాంక్షించారు. ఈ విధంగా.. తాము ఒక్క‌టేన‌ని హీరోలు ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌భావంతో ఉంటే.. అభిమానం వెర్రిత‌ల‌లు వేసిన కొంద‌రు మాత్రం ఫ్యాన్స్ పంచాయ‌తీకి తెర తీస్తూ.. ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇదంతా చూసిన‌వాళ్లు.. పురుగుల‌ను చూసిన ఏహ్యభావం క‌లుగుతోంద‌ని అంటున్నారు. త‌రాలు మారుతున్నా.. వీళ్లు బుద్ధి మాత్రం ఇంకా ఆదిమ‌కాలంలోనే ఉండిపోయింద‌ని మండిప‌డుతున్నారు. ఈ ఫ్యాన్స్ మార‌రా? వీళ్ల పద్ధతి మారదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. నిజంగానే వీళ్ల ప‌ద్ధ‌తి మార‌దా?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version