
చెట్లను నరకడానికి అందరూ పోటీపడేవారే.. కానీ.. మొక్కలు నాటడానికి మాత్రం ముందుకు వచ్చేవారు అత్యంత అరుదు. అలాంటి వారికి కూడా చెట్టు గొప్పదనం ఏంటో చాటిచెప్పిన మహనీయుడు దరిపల్లి రామయ్య. చెట్ల పెంపకానికే జీవితాన్ని అంకితం చేసిన రామయ్య.. వనజీవిగా కీర్తిపొందారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ప్రభుత్వ.. రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఖమ్మం నగర శివారులోని రెడ్డిపల్లి ఆయన స్వగ్రామం. ఆ గ్రామం నుంచి అటు ఇటూ కిలోమీటర్ల పొడవునా భారీ వృక్షాలు రహదారి వెంట నీడను పంచుతుంటాయి. అవన్నీ వనజీవి రామయ్య నాటినవే. ఇవేకాకుండా.. జిల్లాలోని పలుచోట్ల ఆయన స్వయంగా మొక్కలు నాటారు. వాటి సంఖ్య ఎంతో తెలుసా..? కోటి మొక్కలకు పైనే! ఇంట్లో భోజనం చేసిన తర్వాత అడవుల్లోకి వెల్లడం.. రకరకాల విత్తనాలను ఏరుకోవడం.. వాటిని తెచ్చి ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లడం.. ఆ మొక్కలు ఎదిగిన తర్వాత తీసుకెళ్లి నాటడం.. ఇదే దినచర్యగా జీవించారు రామయ్య. ఒకటీ రెండు కాదు.. దాదాపు 40 ఏళ్లకు పైనే మొక్కలను పెంచడంలో గడిపిన రామయ్య.. అవే జీవితంగా బతికారు.
ప్రస్తుతం 80 సంవత్సరాల వయసుకు వచ్చినప్పటికీ.. మొక్కల పెంపకం మాత్రం మానుకోలేదు వనజీవి. అలాంటి వనజీవికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశంసా పత్రాన్ని పంపించారు. ఆ ప్రశంసా పత్రాన్ని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో భద్రంగా దాచుకున్నారు రామయ్య. ఆ పత్రంలో ఏముందంటే..
‘‘స్ఫూర్తి ప్రదాత.. వనజీవి.. శ్రీరామయ్యగారికి. ఒకటి కాదు రెండు కాదు.. లక్షలాది మొక్కలను నాటిన పుడమి పుత్రుడు రామయ్య. నా లాంటి వారు ఎందరికో ఆయన ఆదర్శం. మాటలను కాకుండా.. చేసే చేతలను బట్టి కీర్తి ప్రతిష్టలు పొందుతారు అని చెప్పడానికి నిదర్శనం రామయ్యగారు.
నిస్వార్థంతో వనాలను పెంచినందుకు గానూ.. పద్మశ్రీ వంటి పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో వచ్చిచేరాయి. ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో నా గురించి చెప్పిన మాటలు నా బాధ్యతను మరింత పెంచాయి. పచ్చదనమే స్వధనంగా భావించే రామయ్యగారి మాటలను శిరోధార్యంగా పాటిస్తాను.
నలుగురు మనవరాళ్లకు మొక్కల పేర్లు పెట్టారు. 80 ఏళ్ల వయసులోనూ అడవుల వెంట తిరుగుతూ.. విశ్రాంతికే విశ్రాంతినిచ్చి, విత్తనాలు సేకరించి, ఇంటింటికీ పంచుతున్నారు. ఆయనే నిజమైన పర్యావరణ ప్రేమికులు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. వనజీవి రామయ్య పేరు మీద ప్రత్యేక శివరాలు ఏర్పాటు చేస్తాం. సామాజిక వనాలను అభివృద్ధి చేయడంలో నవతరాన్ని భాగస్వామ్యం చేస్తూ పర్యావరణ అభివృద్దికి నా వంతు కృషి చేస్తాను’’ అని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
ఎవరు ఏమన్నా.. ఎందరు గేలీ చేసినా.. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు రామయ్య. నిజంగా.. అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదన్నట్టుగా రామయ్య చేస్తున్న పని అద్భుతం అని ఎవరూ గుర్తించలేదు. ఇవాళ అద్భుతం అని ఎవరూ గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. మొక్కలు నాటి ప్రాణులకు ప్రాణవాయువు అందించేందుకు జీవితాన్నే ధారపోసిన అద్భుతమైన వ్యక్తి రామయ్య. ఆయన నుంచి స్ఫూర్తి పొంది పర్యావరణ పరిరక్షణకు పాటుపడడం ప్రతీ ఒక్కరి బాధ్యత.