Pawan Kalyan: కేవలం 23 ఏళ్ళ వయస్సు, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, కుటుంబం మొత్తానికి అతనే జీవనాధారం, చిన్నప్పటి నుండి నరనరాల్లో దేశభక్తిని నింపుకొని ఇండియన్ ఆర్మీ లో చేరి, సరిహద్దులో ఇటీవలే భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తత పరిస్థితుల్లో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరుడు మురళి నాయక్(Murali Nayak). నిన్ననే అతని పార్థివ దేహం స్వగృహానికి వచ్చింది. కాసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Minister Naralokesh), హోమ్ మినిస్టర్ అనిత, మురళి నాయక్ పార్థివ దేహానికి నివాళి అర్పించి కన్నీటి వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ దాదాపుగా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కి వచ్చేశాడు. మురళి నాయక్ కుటుంబ పరిస్థితి అలాంటిది.
Also Read: సీజ్‌ఫైర్ వద్ద: పాక్ తో ’భారత్ యుద్ధమే కావాలి
సాధారణ రైతు కుటుంబం లో పుట్టి పెరిగిన మురళి నాయక్, 2022 వ సంవత్సరం లో ఇండియన్ ఆర్మీ లో చేరాడు. శిక్షణ పూర్తి అయ్యాక సెలవు దినాలు గడపడానికి సొంతూరికి వచ్చిన మురళి నాయక్ కి, సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడం తో ఆర్మీ అతన్ని వెంటనే వెనక్కి పిలిచింది. అక్కడ ఉగ్రవాదులతో ప్రతిఘటిస్తూ తన చివరి శ్వాసని విడిచాడు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున 50 లక్షల రూపాయిల ఆర్ధిక సహాయం తో పాటు, 5 ఎకరాల భూమి, 300 గజల్లో ఇల్లు స్థలం తో పాటు మురళి నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా తో తెలిపాడు. అంతే కాకుండా వ్యక్తిగతంగా తన తరుపున పాతిక లక్షల రూపాయిల విరాళం కూడా అందిస్తున్నట్టు తెలిపాడు. ఇవి మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా కూటమి లోని మూడు పార్టీలు అండగా ఉంటారని తెలిపాడు.
మురళి నాయక్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘అతనికి రైల్వే లో ఉద్యోగం వచ్చినప్పటికీ, నేను చనిపోతే దేశం కోసమే చనిపోతానని చెప్పి ఇండియన్ ఆర్మీ లో చేరాడు. కుటుంబం మొత్తానికి ఒక్కనొక్క ఆధారం, పట్టుమని 23 ఏళ్ళు కూడా లేవు, ఇంత చిన్న వయస్సు లో దేశం కోసం ప్రాణాలు అర్పించాడు’ అంటూ పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. వాస్తవానికి మురళి నాయక్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అతని సోషల్ మీడియా పోస్టులు చూస్తే పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అనేది తెలుస్తుంది. తమ సాటి అభిమాని ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో గర్వంగా సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా మేమంతా తోడుగా ఉంటామంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.