Pathan 2 NTR Remuneration: ఈమధ్య కాలం లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కేవలం హీరో పాత్రలకు మాత్రమే కాకుండా, తన నటనకు ప్రాధాన్యత ఇచ్చే క్యారెక్టర్స్ లో కనిపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. #RRR చిత్రం పేరుకి మల్టీస్టార్రర్ అయినప్పటికీ, ఆ సినిమా స్టోరీ కి తగ్గట్టుగా రామ్ చరణ్ మెయిన్ లీడ్ అన్నట్టుగా చూపించాడు రాజమౌళి. ఎన్టీఆర్ క్యారక్టర్ కేవలం ఒక సపోర్టింగ్ రోల్ మాత్రమే అన్నట్టుగా ఆడియన్స్ కి రిజిస్టర్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ఎన్టీఆర్ పై ట్రోల్స్ వస్తున్నాయో గత మూడేళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలబడడంతో ఫ్యాన్స్ కాస్త సంతృప్తి చెందారు. అయితే తర్వాత విడుదలైన ‘వార్ 2’ చిత్రం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది.
హృతిక్ రోషన్ హీరో గా నటించిన ఈ చిత్రం లో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసాడు. ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ, సినిమా ఎందుకో ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. అంతే కాదు, ఎన్టీఆర్ తన స్థాయికి తగ్గ క్యారక్టర్ చేయలేదని మండిపడ్డారు. అయితే అందుతున్న లేటెస్ట్ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, ఎన్టీఆర్ ఇప్పుడు మరో పాన్ ఇండియన్ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు, ‘పఠాన్ 2’. షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘పఠాన్’ చిత్రం 2023 వ సంవత్సరం లో విడుదలై వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ని ఒక కీలక పాత్ర పోషించాల్సిందిగా యాష్ రాజ్ సంస్థ అధినేత ఆదిత్య చోప్రా సంప్రదించినట్టు తెలుస్తోంది. ‘వార్ 2’ లో ఎన్టీఆర్ పాత్రకు కొనసాగింపుగా ‘పఠాన్ 2’ లో ఉంటుందట. ‘వార్ 2’ క్లైమాక్స్ వరకు ఎన్టీఆర్ ని విలన్ గానే చూపిస్తారు, కానీ క్లైమాక్స్ తర్వాత మంచోడిగా చూపించి, దేశం కోసం పని చేసే సైనికుడి లాగా మారుస్తాడు కబీర్(హృతిక్ రోషన్). అలా మంచోడిగా ఎన్టీఆర్, పఠాన్ తో చేతులు కలిపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం లో ఉన్నారట మేకర్స్. అంటే ఈ చిత్రం మల్టీ స్టార్రర్ గా పరిగణించొచ్చు. #RRR మరియు ‘వార్ 2’ లకు అభిమానులు నిరాశ చెందిన విధంగా, ఈసారి ఉండబోదని అంటున్నారు, సంక్రాంతి లోపు ఈ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రం నటించడానికి ఎన్టీఆర్ వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు సమాచారం.