Pareshan Movie Review: నటీనటులు : తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత తదితరులు.
మ్యూజిక్: యశ్వంత్ నాగ్
సమర్పణ : రానా దగ్గుబాటి
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి
రచన, దర్శకత్వం : రూపక్ రోనాల్డ్ సన్.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫాలో అవుతున్న సక్సెస్ మంత్రం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తియ్యడమే, ఈ బ్యాక్ డ్రాప్ లో అదే స్లాంగ్ తో సినిమాలు తీస్తే సక్సెస్ ఖాయం అని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. వాళ్ళు అలా నమ్మడానికి కూడా బలమైన కారణం ఉంది, ఎందుకంటే రీసెంట్ గా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ‘ఫిదా’, ‘జాతిరత్నాలు’, ‘బలగం’, ‘దసరా’ మరియు ‘మేము ఫేమస్’ వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. అదే తెలంగాణ నేటివిటీ బ్యాక్ డ్రాప్ లో ఈరోజు విడుదలైన చిత్రం ‘పరేషాన్’. ‘టక్ జగదీష్’ మరియు ‘మాసూద’ ఫేమ్ తిరువూర్ హీరో గా నటించిన ఈ సినిమాకి ‘రోనాల్డ్ రూపక్ సన్’ దర్శకత్వం వహించగా , ప్రముఖ హీరో రానా నిర్మాతగా వ్యవహరించాడు. టీజర్ మరియు ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూ లో తెలుసుకుందాము.
కథ :
ఐజాక్ (తిరువూర్) ITI లో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి. ఉద్యోగం లేకుండా స్నేహితులతో ఆవారా లాగ గాలి తిరుగుడు తిరుగుతూ తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. కొడుకు జీవితం నాశనం అయిపోతుందే అనే బాధతో ఎలా అయినా వాడి జీవితాన్ని సెటిల్ చెయ్యాలి అనే ఉద్దేశ్యం తో సమర్పణం (మురళీ ధర గౌడ్) తన సింగరేణి ఉద్యోగం కొడుకుకి ఇప్పించేందుకు, తన భార్య నగలను తాకట్టు పెట్టి పైరవికి లంచం ఇచ్చేందుకు కొడుక్కి డబ్బులిచ్చి పంపిస్తాడు.కానీ ఐజాక్ తన స్నేహితుడు ఆపదలో ఉండడం చూసి, అతనికి ఆ డబ్బులను ఇచ్చేస్తాడు, లంచం కోసం ఇచ్చిన డబ్బుని ఏమి చేసావు రా అంటూ ప్రతీ రోజు తండ్రి అడగడం, గొడవలు జరగడం వంటివి రొటీన్ గా సాగిపోతుంటాది.మరో పక్క ఐజాక్ తాను ప్రేమించిన అమ్మాయి శిరీష (పావని కరణం) కి కడుపు చేశాను అనే విషయం తెలుసుకొని షాక్ అవుతాడు.ఆమెకి అబార్షన్ చేయించడం కోసం ఏర్పాటు చేసిన డబ్బులను స్నేహితుడు కొట్టేస్తాడు. దీనితో ఐజాక్ పరేషాన్ అయిపోతాడు,ఎలా ఆ డబ్బులను తిరిగి సంపాదించాలి, ఎలా ప్రేమించిన ప్రేయసికి అబార్షన్ చేయించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఈ సందర్భంగా ఎదురయ్యే పరిస్థితులే మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ రోనాల్డ్ రూపక్ ఒక సరికొత్త ప్రయత్నం అయితే చేసాడు కానీ, తెలంగాణ యువత మొత్తాన్ని ఇతగాడు తాగుడుకు బానిసలు అయిన వాళ్ళ లాగా చూపించడమే ప్రేక్షకులకు మింగుడు పడనివ్వకుండా చేస్తుంది. ఈ చిత్రాన్ని పరభాషకి చెందిన వాళ్ళు చూస్తే మన తెలుగోళ్లు, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ముందుకి ఇంత బానిసలు అయ్యారా, ఛీ ఛీ అని అసహ్యించుకునే ప్రమాదం కూడా ఉంది. రెగ్యులర్ గా మందు తాగేవాళ్లకు కూడా డైరెక్టర్ మరీ టూ మచ్ గా చూపించాడు అనే ఫీలింగ్ కచ్చితంగా వస్తుంది. బాధ వచ్చినా , అనందం వచ్చినా, కష్టాలు వచ్చినా ఇలా జీవితం లో ఒక మనిషికి ఏమొచ్చిన మా తెలంగాణ ప్రజలు మందు తాగుతారు అన్నట్టుగా డైరెక్టర్ ఈ చిత్రం లో చూపించాడు, దీనికి తెలంగాణ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఇక సినిమా విషయానికి వస్తే లాజిక్స్ మ్యాజిక్స్ అనేవి పక్కన పెడితే, డైరెక్టర్ రోనాల్డ్ రూపక్ ఒక జెన్యూన్ అటెంప్ట్ అయితే చేసాడని చెప్పొచ్చు. ప్రధాన పాత్రల ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ ని లాగాడు ఆయన.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సినిమా సాగిపోయింది. మధ్యలో కథ గాడితప్పినప్పటికీ చిత్రం లో వచ్చే కామెడీ మరియు ఎమోషన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇక ఈ సినిమాలో ఐజాక్ పాత్రలో తిరువూర్ నటించలేదు, జీవించాడు అని చెప్పొచ్చు. అతని పాత్ర వెండితెర మీద చూస్తున్నప్పుడు చాలా మంది కుర్రాళ్లు తమ నిజ జీవితానికి రిలేట్ చేసుకుంటారు. హీరోయిన్ గా చేసిన శిరీష కూడా తన పాత్రకి న్యాయం చేసింది.ఇక చిత్రం లో తండ్రి పాత్ర పోషించిన ‘మురళీ ధర్’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ఆయన తండ్రి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడని చెప్పొచ్చు. ఇక చిత్రానికి హైలైట్ గా నిల్చిన మరో పాత్ర సత్తి, తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
చివరి మాట :
కాసేపు తెలంగాణ కల్చర్ , మరియు సినిమాలో వచ్చే లాజిక్ లేని సన్నివేశాలను పక్కన పెడితే యూత్ ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ఈ వీకెండ్ కి టైం పాస్ అయ్యే ఒక చక్కటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఈ పరేషాన్.