
పదేళ్ల కిందటి వరకు హీరో అంటే ఒక ఇండస్ట్రీకి చెందిన వాడు. మహా అయితే.. పక్క రాష్ట్ర ప్రేక్షకులకు డబ్బింగ్ కోటాలో పరిచయం. ఇక, దర్శకుడు అయితే.. ఫిక్స్. కెరీర్ మొత్తం ఒకే ఇండస్ట్రీకి పరిమితం అయిపోయేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుండడంతో.. ప్రతీ సినిమాను అదే కోవలో తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. ఒక ఇండస్ట్రీకి చెందిన హీరోలు.. మరో పరిశ్రమలో సైతం మెరుస్తున్నారు. ఒక చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు.. మరో ఇండస్ట్రీకి చెందిన హీరోలతో సినిమాలు తీస్తున్నారు. మరి, ఆ జాబితాలో మన హీరోలు, దర్శకులు ఎవరు అన్నది చూద్దామా..
ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా బాలీవుడ్ లో సత్తా చాటాడు. బాహుబలి తర్వాత వచ్చే సినిమాలన్నీ అన్ని భాషలను దృష్టిలో పెట్టుకొనే తెరకెక్కుతున్నాయి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పటికే.. బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. ‘జంజీర్’ రీమేక్ తో అలరించాడు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అయితే.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.. రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా.. శాండల్ వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ చేస్తున్నాడు. ఇటు రామ్ పోతినేనితో తమిళ దర్శకుడు లింగుస్వామి సినిమా చేస్తున్నారు. అటు మురుగదాస్, లోకేష్ కనగరాజ్ సైతం.. తెలుగు హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో వీరి ప్రాజెక్టులు ఓకే అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇలా.. పక్కభాషలకు చెందిన దర్శకులు.. తెలుగులో స్ట్రయిట్ సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
ఇక, తమిళ్ హీరోలు తెలుగు నాట సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. హీరో సూర్య కోసం దర్శకుడు బోయపాటి ఓ కథ సిద్ధం చేస్తున్నారు. తెలుగు స్ట్రయిట్ సినిమా చేయాలని సూర్య ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇక, వంశీ పైడిపల్లి హీరో విజయ్ తో సినిమా చేయడం కన్ఫామ్ అయినట్టే. శేఖర్ కమ్ముల తన స్టోరీతో.. హీరో ధనుష్ ను ఫిదా చేసేశారు. రాక్షుడు-2 సినిమాలో విజయ్ సేపతి రాబోతున్నాడు. ఇలా.. తమిళ నటులు తెలుగులో స్ట్రయిట్ చిత్రాలు చేయబోతున్నారు.
నిజానికి కళను, కళాకారులను ఒక ప్రాంతానికి పరిమితం చేయలేం. బౌండరీలు గీయలేం. ఆ విధంగా.. ఎక్కడి వారు మరెక్కడైనా సినిమాలు తీయొచ్చు. తీస్తున్నారు కూడా. తమిళ్ హీరో ధనుష్ హాలీవుడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇలా ఇండస్ట్రీలు దాటి పక్క పరిశ్రమలో అడుగు పెట్టడానికి ప్రధాన కారణం.. మార్కెట్ పరిధి పెరగడమే. థియేటర్ నుంచి టిక్కెట్లు తెగితే వచ్చే ఆదాయం కన్నా.. శాటిలైట్, డిజిటల్, ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చేస్తోంది. దీంతో.. హీరోలు, దర్శకులు తమ పరిధిని విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు.