Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మూడు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఫినాలే రోజు జరిగిన దాడి ఘటనలో ప్రశాంత్ ను .. అతని తమ్ముడును అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. కాగా అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే తాజాగా ప్రశాంత్ కు ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది. నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో నేడు చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నాడు. అయితే బిగ్ బాస్ కు వెళ్లక ముందు ప్రశాంత్ యూట్యూబ్ లో, ఇన్ స్టా లో వీడియోస్ చేసి ఫేమస్ అయ్యాడు. అలా బిగ్ బాస్ వరకు వచ్చి విజేతగా నిలిచాడు. కాగా తాజాగా ప్రశాంత్ తన ఇన్ స్టా లో పేరు మార్చాడు. కొత్తగా తన పేరుతో పాటు బయోను మార్చుకున్నాడు. మల్ల వచ్చిన (MALLA OCHINA), స్పై టీమ్ విన్నర్ (Spy Team Winner) అని ఇన్ స్టాగ్రామ్ లో చేర్చుకున్నాడు.
తన విజయంలో స్పై బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్ గుర్తించినట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోతో ప్రశాంత్ కు మరింత క్రేజ్ పెరిగింది. దీంతో ప్రస్తుతం ప్రశాంత్ కు ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ కు ఫైగానే ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఇది ఇలా ఉంటే .. పల్లవి ప్రశాంత్ బెయిల్ విషయంలో సింగర్ భోలే రియల్ హీరో అనిపించాడు. సంతోషం లో ఎవరైనా తోడుగా ఉంటారు .. కానీ కష్టంలో అండగా నిలిచిన వాడే అసలైన మిత్రుడు అని నిరూపించాడు పాటబిడ్డ భోలే.
ప్రశాంత్ అరెస్ట్ అయిన దగ్గర నుండి అతనికి బెయిల్ వచ్చే వరకు చాలా కష్టపడ్డాడు. ఇక బెయిల్ వచ్చిన సందర్భంగా మీడియాతో భోలే మాట్లాడుతూ .. రైతు బిడ్డకు న్యాయం జరిగింది. 15 వేల పూచికత్తు తో పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది అని చెప్పాడు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన లాయర్లలకు ధన్యవాదాలు తెలిపాడు సింగర్ భోలే షావలి.