Pallavi Prashanth: ఏవైనా పోటీలు నిర్వహిస్తే అవి క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రజల్లో ఆసక్తిని కలిగించాలి. చూసేవారిలో జిజ్ఞాసను కలిగించాలి. అంతేగాని రాళ్లు రువ్వుకునేలాగా, వ్యక్తిగతంగా కక్షలు పెంచుకునే విధంగా, భౌతిక దాడులకు దిగే విధంగా ఉండకూడదు. అలా ఉంటే అది క్రీడా స్ఫూర్తి అనిపించుకోదు. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులు చేసింది కూడా అదే. గతంలో ఏ సీజన్లలో జరగనంత గొడవ ఈసారి జరిగింది. పైగా తనను ఎందుకు విజేతగా ప్రకటించలేదని అమర్దీప్ మా టీవీ యాజమాన్యంపై రుసరసలాడాడు. అంతేకాదు అతని అభిమానులు ఏకంగా అన్నపూర్ణ స్టూడియోలోకి చొచ్చుకు వచ్చారు. ఇదే సందర్భంలో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు ఎదురుదాడికి దిగారు. మొత్తానికి అక్కడ రచ్చ రచ్చ చేశారు. ఆర్టిసి బస్సుల అద్దాలు పగలగొట్టారు. గీతు రాయల్ కారును ధ్వంసం చేశారు. కానీ ఇక్కడే మా టీవీ యాజమాన్యం, బిగ్ బాస్ నిర్వాహకులు తప్పటడుగులేశారు.
బిగ్ బాస్ అనేది మన దేశానికి సంబంధించిన గేమ్ షో కాదు. ఓ కౌన్ బనేగా కరోడ్పతి చూడండి ఎంత బాగుంటుందో. అమితాబ్ బచ్చన్ నిర్వహించే ఆ గేమ్ షో కోసం దేశవ్యాప్తంగా ఎంట్రీలు వస్తాయి.. మెదడులో జిజ్ఞాసను పెంచే విధంగా ఆ పోటీ ఉంటుంది. గెలిచిన వారికి నిజంగానే కోటి రూపాయలు బహుమతి దక్కుతుంది. పైగా ఆ బహుమతి దక్కించుకున్నవారు ఇప్పటివరకు ఎటువంటి గొడవలకు దిగిన దాఖలాలు లేవు. పైగా సామాన్యులకు మాత్రమే ఇప్పటివరకు కోటి రూపాయల బహుమతి దక్కింది.. ఆ షో కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అడ్డదిడ్డమైన టాస్కులు, రేటింగ్స్ కోసం పిచ్చిపిచ్చి వేషాలు ఉండవు. కానీ అదే బిగ్ బాస్ అయితే.. చెప్పాల్సిన పనిలేదు.
హిందీలో నిర్వహించే బిగ్ బాస్ అయితే హద్దులు దాటుతుంది. అందులో వచ్చే కంటెంట్ ను రాత్రి 9:00 తర్వాతనే ప్రసారం చేయాలని ఏకంగా ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందీలో అంత కాకపోయినాప్పటికీ మన దగ్గర కూడా బిగ్ బాస్ అనేది ఒక చెత్త షో అని చాలామంది అభిప్రాయం. మనుషుల మధ్య గొడవలు పెట్టడం, వారి కదలికలను 24 గంటల పాటు సీక్రెట్ కెమెరాలో చూడటం, పైగా దానికి మైండ్ గేమ్ అని పేరు పెట్టడం.. సిల్లీ కాకపోతే మరేంటి.. ఇదే సాధన సంపత్తిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో పెడితే బిగ్ బాస్ నిర్వాహకులకు సమ్మగా ఉంటుంది. అక్కడ ప్రతి మానసిక రోగి వ్యవహార శైలిని దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత మనుషుల హావాభావాలు ఏ విధంగా ఉంటాయో..ఇట్టే తెలుసుకోవచ్చు. అప్పట్లో ఇదే బిగ్ బాస్ షోలో శిల్పా శెట్టి కి ఏ విధమైన అవమానం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఆ షోలో కంటెస్టెంట్లు ఎలా వ్యవహరించారో ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. స్థూలంగా చెప్పాలంటే మనుషుల మానసిక పరిపక్వతను అర్థం చేసుకోవాలంటే.. వారి మాట తీరును.. నలుగురిలో ఉన్నప్పుడు వారి వ్యవహార శైలిని పసిగట్టాలంటే సీక్రెట్ కెమెరాలు పెట్టి టాస్కులు ఇవ్వడం కాదు.. ముందుగా వారితో మనస్ఫూర్తిగా మాట్లాడటం.. వారిని ఒకే వేదిక వద్దకు చేర్చి వారి ఇష్టా ఇష్టాలను అభిరుచులను తెలుసుకోవడం.. ఏ విషయాన్ని ప్రముఖ మానసిక వేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. ఈ విషయం తెలియకనే మా టీవీ తిక్క తిక్క టీవీ షో లు నిర్వహిస్తోంది. ఆ షో లల్లో ఇచ్చే టాస్క్ లు, గొడవలు చూసే అభిమానుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. అవి అంతిమంగా ఇలాంటి గొడవలకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలకు జవాబు చెప్పాల్సింది ముమ్మాటికి మా టీవీ, బిగ్ బాస్ టీం.