Pallavi Prashanth
Pallavi Prashanth: బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ పబ్లిక్ న్యూసెన్స్ , ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో వాదనలు కూడా ముగిసాయి. నేడు పల్లవి ప్రశాంత్ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రశాంత్ అరెస్ట్ అతని కుటుంబాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కన్నీరు .. మున్నీరు అయ్యారు. తన కుమారుడని అరెస్ట్ చేసి మాకు సంతోషం లేకుండా చేశారు .. కుమారుల అరెస్ట్ తో తన భార్య ఏడుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యం లో ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ .. ‘ నా కొడుకు బిగ్ బాస్ గెలిచిండు అని మురిసిపోయినా .. ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది. మాకు ఇదంతా అవసరమా? వ్యవసాయం చేసుకుంటే సరిపోయేది అనిపించింది. మా ఊళ్ళో ఉంటేనే బాగుండు .. లేనిపోనివి సృష్టించి వార్తలు రాస్తుర్రు. ప్రశాంత్ పక్కనే నేను ఉన్నా. నాకు వాంతులు కూడా అయ్యాయి. ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు అని వెల్లడించారు.
బుధవారం సాయంత్రం 6:30 నిమిషాలకు పోలీసులు వచ్చి ప్రశాంత్ ను తీసుకెళ్లారు. మాది మారుమూల గ్రామం.. బెయిల్ ఇలాంటివన్నీ నాకు తెల్వదు. నా భార్యకు ఆరోగ్యం బాగోలేదు .. ఆమె ఏడుస్తూ కూర్చుంది. జ్వరం కూడా వచ్చింది. మమ్మల్ని లేని పోనీ ఇబ్బందులు పెట్టిండ్రు సార్. పరేషాన్ చేసిర్రు. బట్టలు మార్చుకుంటా అంటే కూడా వినలేదు.
ముందు మంచిగానే మాట్లాడిర్రు, ఒకాయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులుపట్టి నూక్కొచ్చిర్రు. వారెంట్ కూడా ఇవ్వలేదు దొంగతనం చేసినట్లు ప్రశాంత్ ని తీసుకెళ్లారు. ప్రజలందరికీ నేను ఒక్కటే వేడుకుంటున్నా .. నా కొడుకు దొంగ కాదు .. బిగ్ బాస్ కి పోతానంటే నేనే పంపించినా .. విన్నర్ అయిండు. కానీ ఆ సంతోషం మాకు లేకుండా చేశారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు పల్లవి ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ.