Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని చరిత్ర కలిగిన స్టార్. నాలుగు దశాబ్దాలుగా కళామతల్లికి సేవ చేస్తున్నారు. నూటయాభైకి పైగా చిత్రాల్లో నటించారు. సామాజిక స్పృహ కలిగిన మానవతావాది. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఏర్పాటు చేసి ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. రాజకీయ ప్రవేశం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన చిరంజీవిని అనేక అవార్డులు, రివార్డులు వరించాయి. ఆయన సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు.
మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో గౌరవం చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించనుంది. చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. పద్మభూషణ్ భారత ప్రభుత్వం ఇచ్చే మూడో అతిపెద్ద పౌర సత్కారం. 2006లో చిరంజీవి పద్మభూషణ్ అందుకున్నారు. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరిగింది.
ఈసారి ఆయన పద్మవిభూషణ్ తో గౌరవించబడనున్నారట. పద్మవిభూషణ్ రెండవ పౌర సత్కారం. అతికొద్ది మంది నటులకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ వంటి స్టార్స్ పద్మవిభూషణ్ అందుకున్నారు. ఈ లిస్ట్ లో చిరంజీవి కూడా చేరనున్నాడు. అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
మరోవైపు చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ఆయన నటించిన వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ చిత్రాలు విడుదలయ్యాయి. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. భోళా శంకర్ మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం వశిష్ట్ దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా టైటిల్ అండ్ కాన్సెప్ట్ ప్రోమో విడుదల చేశారు. విశ్వంభర సోషియో ఫాంటసీ చిత్రం. ఈ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి.