దర్శకులు : శ్రీ కృష్ణ & రామ్ సాయి
నిర్మాతలు : కౌశిక్ కుమార్ రామ్ సాయి
టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్స్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పచ్చీస్’. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ కృష్ణ & రామ సాయి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్వేతావర్మ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఈ రోజు నుంచి ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ చిత్రం బాగోతం ఎలా సాగిందో చూద్దాం.
కథాకమామీషు :
అభిరామ్ (రామ్) జూదరి. క్లబుల్లో పేకాట ఆడి లక్షలు పోగొట్టుకోవడంతో పాటు క్లబ్ యజమాని ఆర్కే (రవివర్మ)కు రూ.17 లక్షలు బాకీ పడటం, పైగా ఓ విషయంలో ఆర్కేని మోసం చేయడంతో.. అతని జీవితం మలుపు తిరుగుతుంది. (మలుపు అని దర్శకుడు భావించాడు, కానీ మనకు అనిపించదు లేండి). ఇక ఆ మోసాన్ని ఆర్కే బాబు అసలు తట్టుకోలేడట (అతగాడికి సినిమా మొత్తంలో క్లారిటీ లేకపోవడం మన దౌర్భాగ్యం). అభిరామ్ ని నీడలా వెంటాడుతుంటాడని దర్శకుడు బలంగా చెప్పడానికి చాల బలహీన పడ్డాడు.
ఆ తరువాత అభిరామ్ పెద్ద రిస్క్ చేసి తన కన్నింగ్ నేచర్ ను సగర్వంగా బయటపెడతాడు. ఇంతకీ అతగాడి చేసిన రిస్కేమిటి? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది ? ఎలా ముగిసింది అనేది మిగిలిన బాగోతం.
విశ్లేషణ :
జీవితం కూడా జూదమే, ఎప్పుడు ఎక్కడ ఎవరి పాచికలు పండుతాయో చెప్పలేం అనే సత్యాన్ని చెప్పిన దర్శకులు సినిమా నగ్న సత్యాలను మాత్రం సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. సినిమాలో హీరో డబ్బు చుట్టూ తిరుగుతూ, డబ్బే జీవితంగా మార్చుకున్నట్టు.. దర్శకులు కూడా సీన్స్ ను బలంగా రాసుకుని వాటినే మెయిన్ అన్నట్టు భావించి ఉంటే సినిమాకి విలువ ఉండేది.
హీరో డబ్బు సంపాదన కోసం ఎలా అయితే అడ్డదారులు తొక్కాడో.. ఈ సినిమా కూడా లెంగ్త్ కోసం కథ నుండి పక్క దారులు తొక్కారు. అయినా హీరో ఈజీ మనీ కోసం అలవాటు పడి, తనతో పాటు, తనకు సంబంధం లేని చాలా జీవితాలను పణంగా పెట్టే సీన్స్ చాల సిల్లీగా అనిపించాయి. దీనికి తోడు దర్శకులు ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేసి మొత్తానికి సినిమని డైవర్ట్ చేశారు. మొత్తానికి సినిమాలో కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
స్టోరీ లైన్,
సినిమాలోని మెయిన్ ఎమోషన్
నటీనటులు నటన
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే,
డైలాగ్స్,
డైరెక్షన్,
ఓవర్ యాక్షన్,
ఫేక్ ఎమోషన్స్ తో సాగే సిల్లీ డ్రామా.
సినిమా చూడాలా వద్దా ?
ఒకసారి చూడొచ్చు. అయితే, ఎన్నో గొప్ప సినిమాలు అందుబాటులో ఉన్న ఓటీటీలలో ఇలాంటి బిలౌవ్ ఏవరేజ్ సినిమాని చూడకపోవడం తెలివైన పని అనిపించుకుంటుంది. ఇక ఈ సినిమాలో మంచి పాయింట్ ఉన్నా.. స్లో నేరేషన్, సింపుల్ ప్లే, సింగిల్ ప్లాట్ ఇలా మొత్తంగా బోరింగ్ డ్రామాగా ఈ సినిమా నిలిచింది.