Oscars 2024: ఇండియన్ సినిమాకు ఆస్కార్ అందని ద్రాక్ష అనేది ఒకప్పటి మాట. సమీకరణాలు మారాయి. అసలు తెలుగు సినిమా కల్లో కూడా ఊహించని గౌరవం ఇది. కానీ దర్శకధీరుడు రాజమౌళి సాకారం చేసి చూపారు. 95వ ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ మూవీ అరుదైన గౌరవం దక్కించుకుంది. నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ వేదికపై అవార్డులు అందుకున్నారు. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నాటు నాటు సాంగ్ డాన్సర్స్ పర్ఫార్మ్ చేశారు.
అలాగే ఇండియాకు చెందిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ అవార్డు దక్కింది. ఇది ఆరంభం మాత్రమే. ఇకపై తరచుగా ఇండియన్ సినిమాకు ఆస్కార్స్ రావాలని చిత్ర వర్గాలు భావిస్తున్నారు. ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ సందడి చేసిన నేపథ్యంలో మరో తెలుగు సినిమా ఆస్కార్ ఎంట్రీకి పోటీపడుతోంది. దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కి పంపారు.
ఈ ఏడాది ఇండియా నుండి అధికారిక ఎంట్రీకి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్ ఎంట్రీకి అప్లై చేసుకున్న చిత్రాలను వీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ పరిశ్రమలకు చెందిన 22 చిత్రాలు బరిలో నిలిచినట్లు సమాచారం. ది స్టోరీ టెల్లర్, మ్యూజిక్ స్కూల్, మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే, ట్వల్త్ ఫెయిల్, ఘూమర్, రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని, జ్విగాటో, ది కేరళ స్టోరీ చిత్రాలు ఉన్నాయి.
ఇక టాలీవుడ్ నుండి దసరా, బలగం చిత్రాలు ఆస్కార్ ఎంట్రీకి పోటీపడుతున్నాయట. బలగం ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అయితే జ్విగాటో చిత్రం నుండి బలగం పోటీ ఎదుర్కొంటుందట. మరి చూడాలి బలగం ఆస్కార్ కమిటీని మెప్పిస్తుందో లేదో. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు కుటుంబ సభ్యుల భావోద్వేగాల ప్రధానంగా బలగం తెరకెక్కించారు. బలగం కమర్షియల్ గా కూడా భారీ విజయం సాధించింది.