Murali Mohan: క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉన్న రోజులు అవి. మణిరత్నం సినిమాలు కొనడానికి ఆ రోజుల్లో పోటీ ఎక్కువుగా ఉండేది. అయితే హీరో మురళీమోహన్ కి మణిరత్నం సినిమా అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. ఒకపక్క మురళీమోహన్(Murali Mohan) రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూనే.. మరోపక్క సినిమాల నిర్మాణం కూడా చేస్తున్న సమయం అది. ఈ క్రమంలోనే మణిరత్నం సినిమా కొందామని రెండు, మూడుసార్లు ప్రయత్నం చేసినా కుదరలేదు. అందుకే ఓ రోజు మణిరత్నం ‘ఇద్దరు’ (Iddaru) సినిమా తీస్తున్నాడని తెలిసి.. ఈ సారి ‘‘మీ నెక్స్ట్ పిక్చర్ మాకే ఇవ్వాలండీ’’ అంటూ మురళీమోహన్ భారీ మొత్తం అడ్వాన్స్ గా ఇచ్చి వచ్చారు.
మురళీమోహన్ ఆ ‘ఇద్దరు’ సినిమా పై అంత ఆసక్తి చూపించడానికి ముఖ్య కారణం.. ఎంజీఆర్, కరుణానిధి కథతో మణిరత్నం ఆ చిత్రాన్ని ప్లాన్ చేశారు. అందుకే, మురళీమోహన్ గారు మణిరత్నం అడిగినంత ఇచ్చి.. సినిమాని తెలుగు, తమిళంలో ఒకేరోజు రిలీజ్ చేయాలని ఒక ఒప్పందం కూర్చుకున్నారు. సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.
చాలాసార్లు మురళీమోహన్ గారు సినిమా ఎలా వస్తోందో అని చూడటానికి ప్రయత్నాలు చేశారు. కానీ, మణిరత్నం రిలీజ్ కి ముందు తన సినిమా కథను కాదు కదా, కనీసం ఆల్బమ్ కూడా చూపించరు. ఇక షూటింగ్ లకు వెళ్తే.. సెట్ లోపలకి కూడా రానివ్వరు. చివరకు సినిమా కొన్నవాళ్లు కూడా సగటు ప్రేక్షకుడిలాగానే సినిమాని థియేటర్స్ లోనే చూడాలనేది మణిరత్నం పాలసీ. ఆ రోజుల్లో మణిరత్నంకి ఉన్న క్రేజ్ కారణంగా.. ఇలా అన్నీ షరతులు నడిచేవి.
దాంతో ఇష్టం లేకపోయినా మురళీమోహన్ గారు అన్ని షరతులకీ ఒప్పుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ‘ఇద్దరు’ సినిమా కోసం ఆయన ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టి సినిమాని కొన్నారు. సినిమాకి భారీ హైప్ రాయడంతో.. భారీగా ఖర్చు పెట్టి రిలీజ్ చేశారు. సినిమా విడుదలైన మొదటిరోజు మార్నింగ్ షోకి టాక్ బ్యాడ్ గా వచ్చింది. మ్యాట్నీకి కలెక్షన్లు 30 శాతం తగ్గిపోయాయి. ఇక మూడోరోజుకి సినిమానే లేదు. పెట్టిన డబ్బు అంతా పోయింది.
ఒక విధంగా ఇద్దరు సినిమా కారణంగా మురళీమోహన్ గారు జీరో బ్యాలన్స్ కి వచ్చేశారు. ఎంతో నిరాశ చెందారు. అయితే, ఆ వెంటనే ఆయన తేరుకుని ‘పోయింది డబ్బే కానీ, మన ఆత్మవిశ్వాసం కాదు. భుజాల్లో ఇంకా బలం ఉందిగా’ అని ఆ తర్వాత నుంచి మరింత కసితో పని చేసి.. మళ్ళీ కెరీర్ లో బాగా ఎదిగారు.