OTT: “రానా నాయుడు” దారిలో.. మరిన్ని “సైతాన్లు”

సాధారణంగా ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ ఆకట్టుకోవాలంటే అందులో మంచి కంటెంట్ ఉండాలి. ఓటీటీ లో విడుదల చేసే వాటిల్లో అయితే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. కట్టిపడేసే కథ ఉండాలి.

Written By: Bhaskar, Updated On : June 15, 2023 11:16 am

OTT

Follow us on

OTT: సినిమా అనేది బలమైన మాధ్యమం. అది సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే సినిమాల్లో నటించేవారిని దైవాంశ సంభూతులుగా మనవాళ్లు కీర్తిస్తుంటారు.. అలాంటి సినిమా రాను రాను క్రియేటివిటీ పేరుతో అడ్డదిడ్డంగా మారిపోయింది. విలువలు, సమాజం, సంస్కృతి, సంప్రదాయం అనే విషయాలకు దూరంగా జరగడం మొదలుపెట్టింది. ఫలితంగా ఒకప్పుడు వేలం వెర్రిగా చూసిన జనం.. తర్వాతి రోజుల్లో సినిమాను పట్టించుకోవడం మానేశారు. ఈలోగా కోవిడ్ వచ్చింది. సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ప్రేక్షకులకు వినోదం కావాలి కాబట్టి ఓటీటీ లు తెరపైకి వచ్చాయి. యాప్ రూపంలో ఉంటాయి కాబట్టి, మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్లలో వాటిని డౌన్లోడ్ చేసుకొని దర్జాగా ఎప్పుడు పడితే అప్పుడు చూసేయొచ్చు. సినిమాల కన్నా కొద్దో గొప్పో సెన్సార్ ఉంటుంది. కానీ ఓటీటీకి అలాంటిదేమీ లేదు. అందువల్లే రియాల్టీ పేరుతో నానా చెత్తను నింపేస్తున్నారు. మొన్నటి వరకు అది హిందీ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు తెలుగు కూడా అంతకుమించి అనే స్థాయిలో ఉంటున్నది. అందుకు తాజా సాక్ష్యమే రానా రాయుడు. ఈ వెబ్ సిరీసే బూతు బాగోతం అనుకుంటే.. తాజాగా వచ్చిన సైతాన్ దాన్ని మించేలా ఉంది.

ఎందుకిలా

సాధారణంగా ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ ఆకట్టుకోవాలంటే అందులో మంచి కంటెంట్ ఉండాలి. ఓటీటీ లో విడుదల చేసే వాటిల్లో అయితే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. కట్టిపడేసే కథ ఉండాలి. సీట్ ఎడ్జ్ చివరిలో కూర్చునే లాగా స్టోరీ నారేషన్ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది క్రియేటివిటీ పేరుతో వీటన్నింటికంటే బూతు ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు సరేసరి. ఇలాంటి వాటితో జనాలకు ఎలాంటి మెసేజ్ లు ఇస్తున్నట్టు? ఇక క్రైమ్ సిరీస్ లో విషయంలోనూ ఇదే ధోరణి. మితిమీరిన హింస, విపరీతమైన రక్తపాతం, డ్రగ్స్ వాడకం.. ఇలా చెప్పుకుంటూ పోతే హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావు.. ఇలాంటివి క్రియేటివిటీలో భాగమని దర్శక,నిర్మాతలు ముక్తాయింపు ఇవ్వవచ్చు. కానీ సమాజం మీద అది చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ మధ్య ఢిల్లీలో శ్రద్ధ వాకర్ అనే ఓ యువతి హత్యకు గురైంది. ఆ యువతిని ఆమె స్నేహితుడు చంపేశాడు. పోలీసుల విచారణలో అతడు నెట్ ప్లిక్స్ లో ప్రసారమయ్యే ఒక వెబ్ సిరీస్ చూసి అలా చేశానని ఒప్పుకున్నాడు. ఇక ఇంతకంటే దారుణం ఏముంటుంది? కేవలం హింసతో కూడుకున్న చిత్రాల ద్వారా భారీగా లాభాలు గడించవచ్చని నిర్మాతలు, దర్శకులు అనుకోవడమే ఈ ఉత్పాతానికి ప్రధాన కారణం. పైగా వర్ధమాన నటీనటులు ఎంత రెచ్చిపోతే అంత అవకాశాలు వస్తాయని భ్రమ పడటం కూడా మరో కారణం.

రానానాయుడు దారి చూపించింది

తెలుగు సినిమాలో వెంకటేష్ ది విలక్షణ శైలి. కుటుంబంతో కలిసి సరదాగా చూసేలా ఉంటాయి ఆయన సినిమాలు. ఉన్నట్టుండి ఆయనకి ఏమైందో తెలియదు గానీ రానా నాయుడు అనే బూతు నిండిన సినిమాలో నటించాడు. ఇందులో ఆయనతో అతడి అన్న కొడుకు దగ్గుబాటి రానా కూడా నటించాడు. ఈ వెబ్ సిరీస్ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అన్ని బూతులే ఉంటాయి. కొన్ని కొన్నిచోట్ల మనం చెవులు మూసుకోవాల్సి ఉంటుంది.. దీనిని నెట్ ప్లిక్స్ నిర్మించింది. ఇక నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యే వెబ్ సిరీస్ లు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఇంతటి బూతు నిండిన రానా నాయుడు నెట్ ప్లిక్స్ లో టాప్ పొజిషన్లో ఉండడం విశేషం. ప్రేక్షకులు బూతులు మాత్రమే చూస్తున్నారు అనుకోవాలా? ఎలాగూ సబ్ స్క్రిప్షన్ చేసుకున్నాం కాబట్టి.. తప్పదు అని చూస్తున్నారు అనుకోవాలా?

సైతాన్ కూడా అదే కోవలో..

రానా నాయుడు మొత్తం బూతులు అనుకుంటే.. మహి వీ రాఘవ్ తీసిన సైతాన్ కూడా అంతకుమించి అనేలా ఉంది. గతంలో ఇతడు యాత్ర, ఆనందోబ్రహ్మ అనే సినిమా తీశాడు. యాత్ర సినిమా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కారణమైంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో ఒక్క కోణాన్ని మాత్రమే తీసుకొని దాన్ని అందమైన చిత్రంగా మలిచాడు రాఘవ్.. కానీ ఆ టెంపోను సైతాన్ వెబ్ సిరీస్ లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ సిరీస్ మొత్తం అడ్డగోలు బూతులు ఉన్నాయి.. యూట్యూబ్లో ట్రైలర్ చూస్తున్నప్పుడే చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి.. ఇక ఇలాంటి సీరిస్ లను ఫ్యామిలీతో ఎలా చూస్తాం? ఇలాంటప్పుడే ఓటీటీ ని కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకు రావాలిసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏర్పడటమే కాదు తీసుకురావాలి కూడా. ముందుగానే చెప్పినట్టు సినిమా లేదా వెబ్ సిరీస్ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలి కానీ.. పక్కదారి పట్టించేలాగా ఉండకూడదు. ముఖ్యంగా యువతను వక్రమార్గం అస్సలు పట్టించకూడదు.