RRR PressMeet: దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్‌ను నిన్న విడుదల చేసింది చిత్రబృందం. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌కు చేరుకుని.. ప్రభంజనం సృష్టించింది. కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ట్రైలర్‌గా నిలిచి.. ఆల్‌టైమ్ నెంబర్ 1 స్థాయిలో నిలిచింది. ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్‌కు చేరువలో ఈ ట్రైలర్ నెట్టింట దూసుకెళ్లిపోతోంది.
కాగా తాజాగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు రాజమౌళితో పాటు చరణ్, తారక్ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే భీమ్ పాత్రకోసం ఎంతగా శ్రమించారని అడగ్గా.. తారక్ స్పందిస్తూ.. అది చెప్పడం కూడా కష్టమేనని.. భీమ్ పాత్రలో ఆయన భాష, మాటతీరు, నడక, మనస్తత్వం ఇలా అన్ని కోణాల్లో నన్ను తీర్చి దిద్దించి మాత్రం జక్కన్నేనని అన్నారు తారక్. కేవలం కండలుంటే సరిపోదని.. గుండెబలం కూడా అవసరమని ఈ పాత్ర చెబుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు పులితో పోరాట సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. నా ముందున్న పులి కంటే.. ఆ పులి వెనకున్న పెద్ద పులి రాజమౌళి అని.. ఆ సమయంలో ఆయనకే నేను భయపడ్డా అని సరదాగా కామెంట్ చేశారు ఎన్టీఆర్.