Homeఅప్పటి ముచ్చట్లుNTR, KV Reddy: ఆ మహా దర్శకుడికి అవమానం.. ఎన్టీఆర్ కళ్ళల్లో కన్నీళ్లు...

NTR, KV Reddy: ఆ మహా దర్శకుడికి అవమానం.. ఎన్టీఆర్ కళ్ళల్లో కన్నీళ్లు !

NTR KV ReddyNTR, KV Reddy Sri Krishna Satya: కె.వి.రెడ్డి..(KV Reddy) తెలుగు సినిమా రంగానికి స్వర్ణయుగాన్ని చవిచూపించిన వాహినీ, విజయా సంస్థకు ఆ దిగ్గజ దర్శకుడు ఒక మూలస్తంభం. ఆయన తీసిన మాయాబజార్, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ వంటి చిత్రాలు తెలుగు సినీ లోకానికి ధృవతారలుగా నిలిచిపోయాయి. అందుకే ఆ దిగ్దర్శకుడు దర్శకత్వంలో నటించాలని ఆ రోజుల్లో మహా మహా నటులు కూడా ఆశగా ఎదురు చూసేవారు. అందుకు తగ్గట్టుగానే ఎందరో హీరోలకు వెండితెర పై సుస్థిర స్థానాన్ని అందించిన గొప్ప దార్శనికుడు కె.వి.రెడ్డి.

కానీ, ఆయన పద్ధతులు, విధానాలు వేరు. దాంతో, ఆయనకు ఎన్నో సమస్యలు వచ్చేవి. ముఖ్యంగా ఆయనతో ఎక్కువ చిత్రాలు నిర్మించిన విజయా సంస్థ అధిపతులలో ఒకరైన చక్రపాణితో ఆయనకు అనేక వివాదాలు జరుగుతూ ఉండేవి. దీనికితోడు కె.వి.రెడ్డితో సినిమా అంటే సంవత్సరం పట్టేది. ఆయనకు ఎలా పడితే అలా సినిమా తీయడం నచ్చదు.

ముందుగా శ్రద్ధగా స్క్రిప్ట్ రాసుకుని, దాన్ని విజువలైజ్ చేసి, రిహార్సల్స్ చేయించుకుని తర్వాతే షూటింగ్ కి వెళ్లేవారు. ఈ పద్ధతి కారణంగానే ఆయన సినిమాలకు బడ్జెట్ కూడా పెరిగిపోయేది. దాంతో ఓ దశలో ఆయనతో సినిమా చేస్తానంటే పెట్టుబడి పెట్టేవారు కరువైపోయిన పరిస్థితి వచ్చింది. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత కె.వి.రెడ్డి నిర్మాత కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూశారు.

కానీ ఏ నిర్మాత ముందుకు రాలేదు. అది ఆ మహా దర్శకుడికి పెద్ద అవమానంలా అనిపించింది. దాంతో రోజురోజుకు ఆయన ఆరోగ్యం కూడా క్షీణించి పోతూ వచ్చింది. అయితే, ఓ సినిమా సెట్ లో ఎన్టీఆర్ (NTR) గారు మేకప్ వేసుకుంటూ కనిపించారు. అది చూసిన రచయిత నరసరాజు గారు నేరుగా పోయి కె.వి.రెడ్డిగారి పరిస్థితి గురించి చెప్పారు.

ఎన్టీఆర్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కె.వి.రెడ్డి అంటే ఎన్టీఆర్ కు విపరీతమైన గౌరవాభిమానాలు. కారణం.. 1951లో తిరుగులేని స్టార్ గా వెలిగిపోతున్న అక్కినేని నాగేశ్వరరావుకి పోటీగా మరో హీరోని తీసుకురావడానికి ఏ దర్శకుడు ధైర్యం చేయలేదు. ఒక్క కె.వి.రెడ్డిగారు మాత్రమే ఎన్టీఆర్ ఆవేశాన్ని గమనించి, తన ‘పాతాళ భైరవి’ సినిమాలో హీరో రామారావే అంటూ పట్టుబట్టి ఎన్టీఆర్ ని హీరోగా పెట్టుకుని మొట్టమొదటి సూపర్ స్టార్ ను చేశారు.

ఆ అభిమానంతోనే ఎన్టీఆర్, కె.వి.రెడ్డి గారి దగ్గరకు వెళ్లి ఆయనకు నమస్కారం చేసి ‘గురువుగారూ, పింగళిగారు రాసి ఇచ్చిన రెండు కథలు నా దగ్గర ఉన్నాయి. ఒకటి ‘చాణక్య చంద్రగుప్త’, రెండోది ‘శ్రీకృష్ణసత్య'(Sri Krishna Satya). వీటిల్లో ఏదోకటి నా బ్యానర్‌ లో మీరు సినిమా చేసి పెట్టాలి’ అడిగారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ మాటలకు పరమానందభరితుడైన కె.వి.రెడ్డిగారు లేచి ఎన్టీఆర్ ను కౌగిలించుకుని.. ‘రామారావ్ ‘శ్రీకృష్ణసత్య’ చేస్తాలే’ అని భుజం తట్టారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version