Neehar Sachdeva: పెళ్లి చేసుకుంటున్నాం అంటేనే పెళ్లి కూతుర్లు ఎక్కువగా కేశాలంకరణపై దృష్టి పెడతారు. కేశాలు తక్కువగా ఉంటే.. కృత్రిమ వెంట్రుకలు కూడా జోడిస్తారు. పెళ్లిలో, ఫొటోల్లో అందంగా కనిపించేలా చూసుకుంటారు. అయితే కురులే మగువకు అందం అందుకే కేశాలంకరణపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే ఇక్కడ ఓ బోల్డ్ బ్యూటీ తనకు వెంట్రుకలు లేవని బాధపడలేదు. ’గుండు చేసుకుంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు?’ అని బామ్మ అన్న మాటలను పట్టించుకోలేదు. బాధపడలేదు. జుట్టు లేదని ఇష్టపడని వ్యక్తిని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి?’ అంటూ తిరిగి ప్రశ్నించింది. అవును మరి.. ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన కురులను ఆమె తన జీవితం నుంచి పూర్తిగా వదిలేసుకుంది. అందుకు కారణం అనారోగ్యమే అయినా.. చిన్న వయసులోనే తన పరిస్థితిని అర్థం చేసుకొని ధైర్యంగా నిలబడింది. అదే ఆత్మస్థైర్యంతో ఇప్పుడు గుండుతోనే పెళ్లిపీటలు ఎక్కింది. ఆమే.. అమెరికాలో స్థిరపడిన భారత ఫ్యాషన్ ఇన్‌ఫ్లూయెన్సర్ నీహర్ సన్దేవా. ఈ ’బోల్డ్ బాల్డ్’ బ్యూటీ గుండు వెనుక కథేంటో తెలుసుకుందాం..!
చిరకాల మిత్రుడితో వివాహం..
లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడిన భారత కంటెంట్ క్రియేటర్ నీహర్ సన్దేవా కొద్ది రోజుల క్రితం తన చిరకాల మిత్రుడును వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది. అవి నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. అందులో సన్దేవా గుండుతో ఉండడమే. చిన్నప్పటి నుంచే అలోపేసియా బ్యాధితో బాధపడుతున్న నిహర్ విగ్గు ధరించడానికి ఇష్టపడడం లేదు. చివరకు పెళ్లి పీటలపైకి కూడా గుండుతోనే వచ్చింది. భారతీయ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకుంది.
అరుదైన వ్యాధి..
నీహర్.. అలోపేసియా అపూ అనేదైన వ్యాధితో బాధపడుతోంది. ఆరు నెలల వయసు నుంచే ఆమెకు ఈ వ్యాధి ఉంది. దీంతో ఆమె జుట్టు ఊడిపోతుంది. అప్పుడప్పుడు ఆమెకు కొత్త జుట్టు వచ్చినా అది కూడా కొద్ది రోజులే ఉంటుంది. అది కనబడకుండా ఉండేందుకు కొన్నేళ్లు విగ్గులు పెట్టుకునేంది. కానీ విగ్గులతో విసిగిపోయిన నీహర్.. చివరకు పూర్తి గుండు చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పెళ్లి కాదని భయపెట్టారు. అయినా ఆమె పట్టించుకోలేదు. ధైర్యం కోల్పోలేదు. జుట్టు లేదని పెళ్లి చేసుకోనివారిని నేనే తిరస్కరిస్తా అని చెప్పారు. నీహర్ నిర్ణయానికి ఆమె తండ్రి మద్దతు ఇచ్చాడు. కూతురు కోసం తాను కూడా గుండు చేయించుకున్నారు. ఈ అరుదైన వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు బంధువులను పిలిచి పార్టీ కూడా ఇచ్చారు.
గుండుతో ఫొటోషూట్..
కొన్నేళ్ల క్రితం నీహర్ కథను బ్రౌన్ గర్ల్ మ్యాగజైన్ ప్రచురించింది. అప్పుడే ఆమె గురించి, అరుదైన వ్యాధి గురించి అందరికీ తెలిసింది. అదే మ్యాగజైన్ కోసం ఆమె పెళ్లికూతురిగా ముస్తాబై ఫోటోషూట్‌లో పాల్గొంది. అప్పుడు కూడా ఆమె విగ్గు ఆఫర్ చేసినా గుండుతోనే ఫొటోలు దిగింది. ప్రస్తుతం ఆమె పెళ్లి దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. బోల్డ అండ్ బ్యూటీఫుల్ అంటూ ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు.
అలోపేసియా అంటే..
ఇక అరుదైన అలోపేసియా వ్యాధి గురించి పరిశీలిస్తే.. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తి, జుట్టు పై దాడి చేస్తుంది. ఫలితంగా తలపై జుట్టుతోపాటు ముఖం, చేతులపై ఉండే వెంట్రుకలు ఊడిపోతాయి. ఈ వ్యాధితో బాధపడేవారిలో కొందరికి జుట్టు ఊడిపోవడం స్వల్పంగానే ఉన్నప్పటికీ మరికొందరిలో ఈ లక్షణం తీవ్రంగా ఉంటోంది. ఇది కాకుండా ఏ ఇతర అనారోగ్య సమస్య ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై స్పష్టమైన కారణాన్ని శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేయలేదు. అయితే జన్యుపరమైన లోపాలు లేదా ఇతర పర్యావరణ సమస్యల కారణంగా ఇలా జరుగొచ్చని చెబుతున్నారు.